అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో యువ ఆటగాళ్లు ఫైనల్లో బోల్తా పడ్డారు. తిరుగులేని ఆటతో.. ఫేవరేట్లుగా ఫైనల్లోకి అడుగుపెట్టిన యువ ఆటగాళ్లు.. బంగ్లాదేశ్ యువతరానికి తల వంచారు. తొలుత బ్యాటింగ్ చేసిన.. టీమిండియా ఆటగాళ్లు.. పెద్దగా రాణించలేకపోయారు. 177 పరుగులకు ఆలౌటయ్యారు. ఈ సిరీస్‌లో నిలకడగా ఆడి…భవిష్యత్ టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ప్రశంసలు పొందుతున్న యశస్వి జైస్వాల్ మాత్రమే రాణించాడు. మొత్తం జట్టు చేసిన 177 పరుగుల్లో 88 జైస్వాల్ చేసినవే. పదకొండు ఎక్స్‌ట్రాలు పోను.. మిగతా అందరూ కలిసి 78 పరుగులు మాత్రమే చేయగలిగారు. చేజింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కూడా.. ఏకపక్షంగా ఏమీ విజయం సాధించలేదు.
ఓ దశలో 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడంతో… మ్యాచ్ భారత కుర్రాళ్ల చేతుల్లోకి వచ్చినట్లయింది. కానీ వికెట్ కీపర్ అక్బర్ అలీ.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు.. వెన్నుముకగా నిలిచారు. ఎవరూ స్థిరంగా లేకపోయినా… తాను మాత్రం వికెట్లకు అతుక్కుపోయారు. లక్ష్యం చిన్నది కావడంతో.. కావాల్సినన్ని బంతులు ఆడటానికి ఉండటంతో.. నింపాదిగా.. పరుగులు చేస్తూ… లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. చివరికి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందారు. చాంపియన్‌గా అవతరించారు. క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుదున్న బంగ్లాదేశ్…భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోందని.. యువతరం నిరూపించింది. ఎదురే లేకుండా విజయాలు నమోదు చేస్తూ వస్తున్న ఇండియా కుర్రాళ్లను మొక్కవోని పట్టుదలతో ఓడించారు.
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాళ్లు… చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నా..అడపా దడపా సంచలన విజయాలు నమోదు చేయడమే కానీ.. ఇంత వరకూ స్థిరంగా ఓ టోర్నీని గెలుచుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు… ఏకంగా అండర్ 19 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో.. బంగ్లాదేశ్‌లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఏ లెవల్లో అయినా బంగ్లాదేశ్‌కు ఇదే మొదటి ప్రపంచకప్.