రెండు వారాల కిందట ప్రెస్‌మీట్ పెట్టి రెండు, మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఉంది. ఆ తర్వాత నోటిఫికేషన్లే నోటిఫికేషన్లు అని ప్రకటించేశారు కేసీఆర్. కానీ ఇప్పటికీ ఉద్యోగ సంఘాలతో సమావేశం పూర్తి కాలేదు సరి కదా … నోటిఫికేషన్ల గురించే చర్చ లేదు. ప్రతీ ఎన్నికలకు ముందు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి హడావుడి చేయడం.. అయిపోయిన తర్వాత సైలెంటవడం కేసీఆర్ ప్రభుత్వానికి కామన్‌గా మారింది. ఇప్పుడు మరోసారి అదే రీతిలో మోసపోయామన్న భావనకు ఉద్యోగులు వస్తున్నారు.
ఇప్పుడల్లా ఉద్యోగాల భర్తీ ఉండదనే సంకేతాలను అధికారులు పంపుతున్నారు. ఇంత వరకూ కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉద్యోగుల కేటాయింపునకు చాలా సమయం పడుతుందని ఉద్యోగ సం ఘాల నేతలు పేర్కొంటున్నారు. దీంతో అప్పటివరకు రాష్ట్రంలోని 8 లక్షల మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. ఏ పోస్టులు ఏ కేటగిరీలోకి వస్తాయన్న వర్గీకరణను పూర్తి చేసిన ప్రభుత్వం వివిధ శాఖల్లోని పోస్టుల వివరాలనూ సేకరించింది. శాఖల వారీగా మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల వివరాలను తీసుకుంది.
ఆర్థిక శాఖ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన లెక్కల ప్రకారం 67,820 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆగస్టులో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌కు లెక్క చెప్పారు అధికారులు. అయితే మళ్లీ పరిశీలన చేపట్టారు. ఇప్పటివరకు ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల ప్రకారం కేటాయించడం, అందుకోసం వారికి ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇవన్నీ అయిన తర్వాతనే ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించే అవకాశముంది. అదయితేనే ఉద్యోగ నోటిఫికేషన్లు. మధ్యలో ఇచ్చే అవకాశమే లేదని.. ఎన్నికలతో ముడి పెట్టి.. ముందస్తుకు వెళ్లే పని అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే నిరుద్యోగుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమే.