ఎన్నికల సమయంలో గెలుపు ఒక్కటే లక్ష్యం. ఏం చెప్పైనా సరే, ప్రజలతో ఓట్లు వేయించుకోవడం ఒక్కటే గమ్యం! దీంతో నాయకులు నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తారు. మేం అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అంటూ వరుస వాగ్దానాలు చేస్తారు. తీరా అధికారంలోకి వచ్చాక… అప్పట్లో అనుకున్నాంగానీ, ప్రాక్టికాలిటీస్ ఆర్ డిఫరెంట్ అంటూ కొత్త విశ్లేషణలు మొదలెడతారు! గతంలో నిరుద్యోగుల విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఇలాంటిదే…! బాబు వస్తే జాబు గ్యారంటీ అన్నారు. దాని అమలు ఏ స్థాయిలో ఉందో ఓపెన్ సీక్రెట్. నిరుద్యోగులకు ప్రతీనెలా భృతి ఇస్తామని కూడా ప్రకటించారు. ఈ హామీ గురించి గడచిన రెండున్నరేళ్ల పైబడిన పాలనలో ఏనాడూ స్పందించింది లేదు. అయితే, ఇన్నాళ్లకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు సర్కారు నిర్ణయించడం విశేషం!
గతంలో నిరుద్యోగ భృతి అమలుపై రకరకాల అధ్యయనాలు చేస్తున్నామన్నారు. భృతి ఇస్తున్న రాష్ట్రాలను చూస్తున్నామనీ, కొన్ని టెర్మ్స్ అండ్ కండిషన్స్ తయారు చేసే క్రమంలో ప్రభుత్వం ఉందనీ గతంలో మంత్రి అచ్చెన్నాయుడు ఏదో కొత్త కారణం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ హామీని శాశ్వతంగా అటకెక్కించే ప్రయత్నంలో తెలుగుదేశం ఉందని అప్పుడే కొన్ని విశ్లేషణలు వచ్చాయి. మరి, ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడు మాత్రమే ఇది తెరమీదికి ఎందుకొస్తుందీ అంటే… ప్రజా వ్యతిరేక సెగ నెమ్మదిగా టీడీపీకి తగులుతోందని చెప్పుకోవాలి.
టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏదో చేశామని చెప్పుకున్నారు. మహిళలకు కూడా చాలా ప్రయోజనాలు కల్పిస్తున్నామనీ చాటుకున్నారు. కానీ, యువతకు ఏం చేసిందీ సర్కారు అని నిలదీస్తే.. వారి దగ్గర సమాధానం లేదు. బాబు వస్తే జాబు అన్నారు. ఆయన వచ్చారు… కానీ, జాబులు రాలేదు అనే అభిప్రాయం యువతలో బలంగా పడుతోంది. కాబట్టి, యువతలో తెలుగుదేశం పట్ల నెగెటివిటీ పెరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే, ఆ నిరుద్యోగ భృతి ఇప్పుడే ప్రకటించేస్తే పార్టీకి కాస్తైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా!
ఇక్కడో చిన్న ట్విస్ట్ కూడా ఉందండోయ్! నిరుద్యోగ భృతి తీసుకున్నవారితో సామాజిక కార్యక్రమాలకు చేయించుకునే ప్రపోజల్ కూడా ఉందట! భృతి పొందేవారి సేవల్ని వినియోగించుకునే విధంగా పథకాన్ని తయారు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించిందిట! సామాజిక కార్యక్రమాలు అంటే ఏ తరహాలో ఉంటాయో చూడాలి మరి! అయితే… భృతి ప్రకటించినంత మాత్రాన యూత్ ఖుషీ అయిపోతారని భావిస్తే తప్పులో కాలేసినట్టే..! ఉద్యోగాలేవీ..? నోటిఫికేన్లేవీ..? రాష్ట్రానికి వస్తున్నాయన్న సంస్థలేవీ…? అవి కల్పిస్తున్న ఉపాధి అవకాశాలేవీ..? ఓవరాల్.. నిరుద్యోగ భృతి ఒక కంటి తుడుపు చర్యగా మాత్రమే కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నవారూ ఉన్నారు.