ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది.దానిపై ఉద్యమాలు జరిగాయి. అయితే అసలు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తున్నాయో రావడం లేదో ఎవరికీ తెలియదు. ఇక తాజాగా సీఎం జగన్ మరో నూటయాభై వరకూ గ్రూప్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా.. జిల్లాల విభజన కారణంగా ఏ ఒక్క ఉద్యోగమూ ముందు ముందు భర్తీ చేయడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. దానికి తెలంగాణలో జరిగిన విషయాలనే సాక్ష్యంగా చూపిస్తున్నారు.
కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు వాటిని జోన్ల వారీగా విభజించాలి. పాత జిల్లాల వారీగా జోన్లను కొనసాగించడానికి చాన్స్ ఉండవు. జోన్ల విషయాన్ని కేంద్ర హోంశాఖ క్లియర్ చేసి.. రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. అక్కడ సంతకం పని అయిపోతే.. అప్పుడు జోన్లు అమలులోకి వస్తాయి. ఈ జోన్లు ఇటీవల వరకూ అమల్లోకి రాకపోవడం వల్ల తెలంగాణలో ఇప్పటి వరకూ ఉద్యోగాల భర్తీ జరగలేదు. విడుదలైన ప్రతి నోటిఫికేషన్ పై కోర్టు పిటిషన్లు పడ్డాయి. దీంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని ప్రాంతాల వారికి స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ల కల్పనకుగాను 1973లో రాజ్యాంగ సవరణతో 371 (డి) నిబంధనను తీసుకువచ్చారు. 1974లో ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రాతిపదికన 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీటి ద్వారా జోనల్, మల్టీ జోనల్, జిల్లా యూనిట్‌తో కూడిన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. వీటిని తెలుగు రాష్ట్రాలు పాటించాల్సి ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులను బ్రేక్ చేయడానికి ఎవరికీ అవకాశం లేదు.
విభజన జిల్లాలకు తగ్గట్లుగా కొత్త జోనల్ విధానాన్ని తేవడనికే కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. చివరికి ఆరేడేళ్ల తర్వతా అనుకున్నట్లుగా జోనల్ ఉత్తర్వులు రాష్ట్రపతి భవన్ నుంచి రావడంతో నియామకాల ప్రక్రియ ప్రారంభించారు. సీఎం జగన్‌కు ఇది ఎంత కాలం పడుతుందో అంచనా వేయడం కష్టం. ఎలా చూసినా ఇప్పుడు ఏపీలో ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదు. నోటిఫికేషన్లు వేసినా.. కోర్టు కేసులు పడతాయి. జిల్లాల విభజన చేయకపోతేనే ఉద్యోగాల భర్తీ సాధ్యమవుతుందన్నది తెలంగాణ అనుభవాలు చెబుతున్న పాఠం.