నోట్ల రద్దు వల్ల సామాన్యులకు ఒరింగిందేమిటో కానీ… యువతను మాత్రం నిరుద్యోగబాట పట్టించింది. నోట్ల రద్దు తర్వాత ఏకంగా 50 లక్షల ఉద్యోగాలు పోయాయని విషయం వెల్లడయింది. “స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019” నివేదిక ప్రకారం… నోట్ల రద్దు తర్వాత దేశంలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయి. మోడీ హయంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగింది. లక్షలాది మంది యువతీయవకులు.. ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. ఆ హామీని నిలబెట్టుకోలేదు. పైగా జీఎస్టీ, నోట్లరద్దు నిర్ణయాల వల్ల నిరుద్యోగం పెరిగిందని తేల్చి చెబుతున్నారు.
నవంబర్ 2016లో మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నుంచే ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని నివేదిక తేల్చిచెప్పింది. ఉన్నత విద్యావంతులు, యువకులు నిరుద్యోగుల్లో అత్యధికంగా ఉన్నారు. 2017-18 సంవత్సరంలో నిరుద్యోగ శాతం గత 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయ్. నేషనల్ శాంపిల్ సర్వేకు చెందిన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం.. దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతం ఉన్నట్లు చెబుతోంది. ఇది 1972-73 తర్వాత ఇదే అత్యధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుదేలయ్యాయ్. కొన్ని రంగాల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. చిన్నపరిశ్రములు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ నిరుద్యోగానికి దారి తీశాయి.
నోట్లరద్దు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా చిన్నాభిన్నం చేసిందని విపక్ష పార్టీలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. వాటిని బలపరిచేలా అనేక నివేదికలు బయటకు వస్తున్నాయి. ఈ కారణంగానే.. నోట్ల రద్దు గురించి ఎన్నికల ప్రచారం నరేంద్రమోదీ ఎక్కడా మాట్లాడటం లేదు. నల్లధనాన్ని నియంత్రించామంటూ.. చేసుకున్న ప్రకటనలు కూడా డొల్లేనని.. ఎన్నికల్లో విచ్చలవిడిగా జరుగుతున్న డబ్బుల పంపకంతోనే తేలిపోయింది. మొత్తానికి నోట్ల రద్దు అనేది ఓ ఫెయిల్యూర్ స్టోరీగా మారిపోయిందన్న క్లారిటీ దేశవ్యాప్తంగా వస్తోంది.