ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల విప్లవం ఇస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి జగన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ లో ని నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లెస్ క్యాలెండర్ అని ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ ని ఎద్దేవా చేస్తున్నారు. దీనికి తోడు టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రాకపోవడం వంటి అనేక కారణాలతో నిన్న విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువత లో అసహనం తారాస్థాయికి చేరి నట్టు గా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
వైఎస్ఆర్సిపి మంత్రుల ఇళ్లను ముట్టడించిన విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు
ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు సరైన జాబ్ నోటిఫికేషన్స్ వేయక పోవడంతో యువత అసహనానికి లోనవుతోంది. వారిలోని అసహనం ప్రభుత్వం దృష్టికి వచ్చిందో లేక రఘురామ కృష్ణంరాజు పార్టీని ఇబ్బంది పెట్టేలా జాబ్ క్యాలెండర్ విడుదల చేయమని లేఖ రాయడం వల్లో తెలియదు కానీ, ప్రభుత్వం ఆ మధ్య జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో భాగంగా, రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని హామీ ఇచ్చిన జగన్ రెండేళ్ల వరకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోగా, ఎట్టకేలకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో అతి తక్కువ పోస్ట్స్ ఉండడం, టీచర్ పోస్ట్ లేకపోవడం పోలీస్ ఉద్యోగాలు తగినన్ని లేకపోవడం యువత ను నిరుత్సాహానికి లోను చేసింది. ఈ నేపథ్యం లో విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన మంత్రుల ఇళ్లను నిన్న ముట్టడించారు. పెద్దిరెడ్డి, బొత్స, వెల్లంపల్లి ఇళ్లను నిరుద్యోగులు ముట్టడించినా, ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘ వివరణ, ఈనాడు పై విమర్శలు
అయితే టీచర్స్ పోస్ట్ ఎంతో కాలంగా భర్తీ కాకపోవడంతో అనేక స్కూల్స్ ఒకే ఒక ఉపాధ్యాయుడి తో నడుస్తున్నాయని, పాఠశాలలు మూతపడే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అని, వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ టీచర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇంకా రాలేదని ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనంలో చెప్పిన విషయాల్లో చాలావరకూ ప్రజలు ఏకీభవించదగినవే కావడంతో ఆ కథనం పట్ల సానుకూల స్పందన వచ్చింది. దీంతో ప్రభుత్వానికి డామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.
ఎప్పుటిలాగానే చంద్రబాబు కోసం ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వ్రాస్తోంది అంటూ పాత పాట పాడారు. ప్రస్తుతం విద్యా రంగాన్ని సమగ్ర ప్రక్షాళన చేస్తున్నామని, నూతన విద్యా విధానం అమలు లోకి వచ్చిన తర్వాతే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రీ ప్రైమరీ మరియు అంగన్వాడి స్కూళ్లను ప్రక్షాళన చేస్తున్నామని, విద్యా రంగాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నామని, జగన్ చేస్తున్న ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళన పూర్తి కాగానే టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, అప్పటి వరకు నోటిఫికేషన్ వేయలేమని ఆయన వివరించారు.
దేశంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా రెండేళ్ల లోనే 183,000 ఉద్యోగాలు జగన్ ప్రభుత్వం ఇచ్చిందని, ఇవన్నీ మీడియాకు కనిపించవా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ ఉద్యోగాలలో చాలా వరకు గ్రామ వాలంటీర్లు సచివాలయాల ఉద్యోగాలు కావడం, గ్రామ వాలంటీర్లది ఉద్యోగం కాదు కేవలం సేవ అని ఆ మధ్య జగన్ స్వయంగా వ్యాఖ్యానించడం, పైగా గ్రామ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగాల లో 90 శాతం తమ వైఎస్ఆర్సిపి కార్యకర్తల కు వచ్చేలా చర్యలు తీసుకున్నాం అని విజయసాయిరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించి ఉండడం వంటి అంశాల నేపథ్యంలో సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు ఊరట ఇవ్వలేక పోతున్నాయి. దీంతో నిరుద్యోగ యువత లో అసహనం తారాస్థాయికి చేరుతోంది.
గెస్ట్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల బాధలు మరొక వైపు:
నోటిఫికేషన్ రాక నిరుద్యోగ యువత పడుతున్న బాధలు ఒకవైపు ఉంటే, గెస్ట్ టీచర్స్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల బాధలు మరొక వైపు ఉన్నాయి. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ని ఫిజికల్ ఎడ్యుకేషన్ గెస్ట్ టీచర్స్ కలిసి, తమకు గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ టీచర్స్ గా తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. మరొక వైపు మోడల్ స్కూల్ గెస్ట్ టీచర్స్ కూడా ఇదే విధంగా తమకు జగన్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీటన్నింటికి తోడు కరోనా వైరస్ పేరు చెప్పి ప్రభుత్వం గెస్ట్ టీచర్స్ అందరిని తీసివేయడం తో వారు రోడ్డున పడ్డారు. తమకు ఉపాధి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏదేమైనా సజ్జల రామ కృష్ణా రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాదిరిగా ఇప్పుడు కూడా యెల్లో మీడియా ని నాలుగు మాటలు తిట్టేసి, చంద్రబాబు మీద నెపం వేసేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి స్పష్టమైన ప్రకటన చేయడమో, లేక సరైన జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం వంటి చర్యలు తీసుకుంటే తప్ప నిరుద్యోగుల లోని అసహనం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.