స్టార్ హీరో, పెద్ద దర్శకుడు ఉంటే చాలు, సినిమాకు అటోమెటిగ్గా క్రేజ్, హైప్ వచ్చేస్తుందన్నది ఒకప్పటి మాట. ఎంత పెద్ద కాంబినేషన్ అయినా… ఒక్కోసారి ఆ సినిమా గురించి జనాలు పెద్దగా మాట్లాడుకోరు. రిలీజ్ కు ముందు హైప్ తీసుకురావడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే.. ‘దేవర’ విషయంలో మాత్రం వద్దంటే హైప్ క్రియేట్ అయిపోతోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. సహజంగానే హైప్ ఉండడం ఖాయం. ఈ సినిమానీ అదే దృష్టితో చూశారు. కానీ.. కొరటాల శివకు ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తగిలింది. దాంతో ఈ సినిమాపై చాలామందికి లేని పోని అనుమానాలు. పైగా రిలీజ్ ఆలస్యమైంది. రెండు భాగాలంటగూ కథని సాగదీశారన్న విమర్శలూ వచ్చాయి. పాటలు విడుదల చేస్తే.. దానికీ మిశ్రమ స్పందన వచ్చింది. హైదరాబాద్ లో ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు. తెలుగులో ఈ సినిమాకు ప్రమోషన్లు సున్నా అంటూ అభిమానులూ పెదవి విరిచారు.
కానీ.. ఇవేం కూడా ‘దేవర’ క్రేజ్‌ని ఆపలేకపోయాయి. పైగా సైలెంట్ వేవ్ లా రోజు రోజుకీ ఈ క్రేజ్ ఎక్కువవుతోంది. హైదరాబాద్ లో జరిగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తరలి వచ్చిన అభిమాన సంద్రాన్ని చూస్తే దేవర హైప్ ఏమిటో అర్థం అవుతుంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఫంక్షన్ రద్దయ్యిందన్న నిరుత్సాహం ఉన్నా – ఎన్టీఆర్‌కూ, దేవర సినిమాకూ ఉన్న క్రేజ్‌కు ఈ వేడుక అద్దం పడుతుంది. అడ్వాన్స్ బుకింగు ఎప్పుడు ఓపెన్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా ఆదివారం విడుదలైన రెండో ట్రైలర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. తొలి ట్రైలర్ బాగున్నా, ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. కానీ రెండో ట్రైలర్ తో ఫ్యాన్స్ కు విందు భోజనం అందింది. పాటలు కూడా మెల్లమెల్లగా జనాలకు ఎక్కేసింది. ‘చుట్టమల్లె’ పాటైతే.. యూత్ కి బాగా పట్టేసింది. ఆయుధ పూజ పాట కూడా అదిరిపోనుందన్న టాక్ ఉంది. ఆ పాట కూడా తోడైతే… ఈ సినిమాని ఆపడం కష్టం.
గురువారం అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. హైదరాబాద్ లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొంది. టికెట్ రేటు కనీసం రూ.2 వేలు ఉంటుందని ఓ అంచనా. అయినా సరే, హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిరోజే దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లు సాధించాలన్నది దేవర టార్గెట్. ఈ ఊపు చూస్తుంటే అదేం పెద్ద విషయం కాదనిపిస్తోంది. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా, దేవర కొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.