వెలగపూడిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం భవన సముదాయంలో నిర్మితమవుతున్న మూడు బ్లాకులలో రెండు బ్లాకులలో కొన్ని చోట్ల సుమారు మూడడుగుల మేర నేల క్రుంగినట్లు తెలుస్తోంది. అక్కడ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలు నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొన్న అధికారులు తక్షణమే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వర్షాల కారణంగా నేల కృంగిందా లేదా ఫ్లోరింగ్ పనులలో నాణ్యత లోపించడం వలన జరిగిందా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.
జూన్ 27 కల్లా సచివాలయంలో నిర్మాణపనులన్నీ పూర్తి చేయాల్సి ఉంది కనుక ఆ తొందరపాటులో ఫ్లోరింగ్ పనులలో నాణ్యత లోపించి ఉంటే దానిని సరిదిద్దుకోవచ్చు కనుక అదేమీ చింతించవలసిన విషయమేమీ కాదు. కానీ వర్షాల కారణంగా భూమి క్రుంగితే మాత్రం అది చాలా ఆందోళనకరమైన విషయమే. ఎందుకంటే రాజధానిగా ఎంచుకొన్న ఆ ప్రాంతంలోనే అనేక బారీ శాశ్విత కట్టడాలు నిర్మించబోతున్నారు. తాత్కాలిక సచివాలయ భవనమే చిన్నపాటి వర్షాలకి గట్టిగా నిలబడలేకపోతే ఇంక అనేక అంతస్తులతో కూడిన పెద్దపెద్ద భవనాలు ఏవిధంగా నిలబడగలవనే సందేహం కలగడం సహజమే. ఈ వార్తని సంబంధిత అధికారులు లేదా ప్రభుత్వ ప్రతినిధులు ఇంకా దృవీకరించవలసి ఉంది.