చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ పౌరులు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈసారి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అనుకూలంగా.. ఇంత భారీ మెజారిటీతో మేయర్ పీఠాన్ని కట్టబెట్టడం అనేది.. చరిత్రలోలేని విజయంగా చెప్పుకోవాలి. మొత్తం 150 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతానికి (సాయంత్రం 6.05) తెలంగాణ రాష్ట్రసమితి, వారు తమ మిత్రపక్షంగా ప్రకటించుకున్న ఎంఐఎం పార్టీలు కలిసి 122 స్థానాలను సొంతం చేసుకున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, భాజపా అందరూ కూడా సింగిల్ డిజిట్లకే పరిమితం అయ్యారు. తెలుగుదేశానికి 1 సీటు, భాజపాకు 4, కాంగ్రెసుకు 2 స్థానాలు మాత్రం దక్కాయి.
అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇలాంటి ఫలితాలను మొత్తం అందరిలోనూ ఏ ఒక్క పార్టీ కూడా ఊహించలేకపోయాయి. పార్టీలు ఎవరికి వారు చేయించుకున్న సర్వేల ద్వారా.. తమకు అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయో ముందే తెలుసుకున్నారు గానీ.. ఏ ఒక్క పార్టీకి కూడా.. ప్రస్తుతం వచ్చిన ఫలితాలకు దగ్గరగా సర్వేలు, అంచనాలు రాలేదన్నది సత్యం. ఒక్కొక్క పార్టీ వారీగా వారి అంచనాలు ఎలా సాగాయి.. ఎలా అంచనాలు తలకిందులయ్యాయో గమనిస్తే..
తెరాస : తెరాస కు వంద సీట్లు వస్తాయని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఆ మాటలు ఆయన శ్రేణుల్లో ఉత్సాహం కోసం చెప్పినవే తప్ప.. ధీమాగా చెప్పినవి కాదు. ఎందుకంటే.. వంద సీట్లు రాకపోతే.. రాజీనామా చేస్తారా? అంటే కేటీఆర్ వెనక్కు తగ్గారు. తన రాజీనామా సవాలును.. ‘మేయర్ పీఠంపై గులాబీ జెండా’ అనే వాగ్దానం వరకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. వంద సీట్లు గెలవగలమని అన్నారు. నిజానికి కేసీఆర్ కూడా ఇంత భారీ విజయాన్ని ఊహించలేదు. తమకు ఓ 60-70 సీట్లు వస్తాయని.. తమ మిత్ర పక్షం మజ్లిస్‌తో కలిపి అధికారంలోకి వస్తామని కేసీఆర్ సభాముఖంగా చెప్పిన సంగతి పలువురికి గుర్తుండవచ్చు. అయితే అనూహ్యంగా వారికి సొంతంగా ఇప్పుడు వంద సీట్లు దక్కే అవకాశ కనిపిపిస్తోంది. ఇప్పటికే వారు 95 మార్కును దాటారు.
తెలుగుదేశం : ఈ పార్టీ చేయించుకున్న సర్వేలో 15 నుంచి 25 సీట్లు రావచ్చునని లెక్కలు వేసుకున్నారు. అయితే ఆ సంగతి బయట చెప్పుకోకుండా మేకపోతు గాంభీర్యం పాటించారు. కానీ ప్రస్తుతం ఒకే స్థానానికి పరిమితం అయ్యారు.
భాజపా : వీరికి గత ఎన్నికల్లో 5 సీట్లు ఉన్నాయి. ఈసారి తెదేపా మైత్రి ఉన్నది గనుక.. కనీసం ఒకటి రెండు స్థానాలైనా పెరుగుతాయని కలగన్నారు. కానీ 3 స్థానాలకు పరిమితం అయ్యారు.
కాంగ్రెస్ : వీరు కనీసం 40 డివిజన్లలో గెలుస్తాం అని పార్టీ అంతర్గత అంచనాల్లో అనుకున్నారు. అయితే వారికి ఒకే ఒక స్థానం దక్కింది.
ఎంఐఎం : వీరికి ఉన్న సీట్లు స్థిరమైనవే అయినప్పటికీ.. ఈసారి సంఖ్య తగ్గవచ్చునని కాస్త ఆందోళన చెందారు. అన్ని పార్టీలు బలంగా పోటికి దిగినందున సీట్లు తగ్గుతాయని అనుకున్నారు. అయితే తాము కింగ్ మేకర్ కాగలం అనుకున్నారు. సీట్లు పెద్దగా తగ్గలేదు. వారికి 30 దక్కాయి. కాకపోతే కింగ్ మేకర్ ఛాన్స్ లేకుండా పోయింది.
ఇలా ప్రజలు ఏ పార్టీ వారి అంచనాలకు కూడా చిక్కకుండా భారీ వ్యత్యాసంతో మెజారిటీని కట్టబెట్టారని అర్థమవుతున్నది.