తెలంగాణ తొలి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సర్వే జరిపించి తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. చాలామంది అలా అంటున్నారు గాని గ్రామ స్థాయి రాజకీయాలతో సంబంధం వున్న వారు మాత్రం టిఆర్ఎస్పై వ్యతిరేకతను కూడా తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు. బయిట సంగతి ఏమోగాని టిఆర్ఎస్లోనే కెసిఆర్‌పై అసంతృప్తి పెరుగుతున్న తీరు నాతో మాట్లాడేవారి తీరును బట్టి తెలుస్తున్నది. ఒక విధమైన ఉక్కపోత, వూపిరి తిరగని స్థితి ఏర్పడిందని వారంటున్నారు. నేను వూహించని స్థాయిలో కొందరు ఆవేదన వెలిబుచ్చుతుంటే ఆశ్చర్యం అనిపించింది. నెలల తరబడి కలుసుకోలేకపోయామనీ, వెళ్లినా రెండు మూడు గంటల సోది భరించలేకపోతున్నామని సూటిగానే చెబుతున్నారు. ఆయనకు ఎప్పుడు ఏది నచ్చుతుందో ఎవరిని కరుణిస్తారో తెలియడం లేదని పదవులు పొందిన వారు కూడా అంటున్నారు. తమ నాయకుడికి చెప్పగలవారెవరైనా వుంటే బావుంటుందని కూడా కోరుకుంటున్నారు. హరీష్‌రావుతో పాటు ఈటెల రాజేందర్‌పై కూడా సార్ ఉపేక్షిత జాబితాలో ముందుకొచ్చారని సమాచారం. తండ్రే అనుకుంటే కెటిఆర్ కూడా పైపైన సరిపెడుతున్నారని పట్టించుకోవడం లేదని విశ్వాసపాత్రులే వాపోతున్నారు. పథకాల లొసుగులు కూడా వారే వివరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమికుడు నరేష్ హత్యను పాలకపక్షం కనీసంగా స్పందించలేదని విమర్శిస్తే దాదాపు ఏకీభవిస్తున్నారు.మాలాటి వాళ్లం మాట్లాడుతుండాలని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ రాసినవన్నీ నూరుశాతం యథార్తాలే గానివూహాగానాలు కాదు. రాయవలసిన మరింత తీవ్ర విషయాలు కూడా వున్నా జీర్ణించుకోవడం కష్టం కనక వదలేస్తున్నాను.