అపుడప్పుడు విదేశాలలో ఫ్లయింగ్ సాసర్స్ కనబడ్డాయని వింటూ ఉంటాము కానీ ఎన్నడూ కళ్ళార చూసి ఎరుగము. కానీ నాలుగయిదు రోజుల క్రితం ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గత నెల 27,28,30వ తేదీలలో డిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపైన డ్రోన్ ల వంటి ఎగిరే వింత వస్తువులు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని డిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, కొందరు విమాన పైలట్లు కూడా చూసారు. అవి విమానాశ్రయం చుట్టూ గాలిలో తేలుతున్నాయి. వాటిలో నుంచి చాలా ప్రకాశవంతమయిన కాంతి పుంజాలు బయటకు వస్తున్నాయి. ఆ కాంతి వలన తాము విమానాన్ని ల్యాండింగ్/టేక్ ఆఫ్ చేయడంలో ఇబ్బంది పడినట్లు ఎయిర్ విస్టా పైలట్లు అధికారులకు పిర్యాదు చేయడంతో వారు తక్షణమే ప్రభుత్వానికి తెలియజేసారు. దానితో అప్రమత్తమయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దింపింది. ఒక హెలికాఫ్టర్ ని పంపి గాలించినప్పటికీ ఆ ఎగిరే వస్తువుల ఆచూకి కనిపెట్టలేకపోయారు. రెండు రోజులు వరుసగా కనబడిన ఆ డ్రోన్ వంటి వస్తువులు మళ్ళీ అక్టోబర్ 30న అదే ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాయి. డిల్లీ విమానాశ్రయ రక్షణ సిబ్బంది, డిల్లీ పోలీసులు, ఎయిర్ ఫోర్స్, ఇంటలిజన్స్ అధికారులను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈసారి కనబడితే వాటిని కూల్చివేయమని ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్ కి ఆదేశాలు జారీ చేసింది.