ప్రతీ రైల్వే స్టేషన్లో తప్పకుండా కనబడేది..వినబడేది..”మీ ప్రయాణం సుఖవంతంగా సాగాలి,” అనే బోర్డు ప్రకటన. కానీ రైలు టికెట్ కొనేటప్పుడు నుంచే ప్రయాణికుల కష్టాలు మొదలవుతుంటాయని అందరికీ తెలుసు. ఎలాగో కష్టపడి రైలులో సీటో బెర్తో సంపాదించుకొన్న తరువాత హమ్మయ్య అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ రైలు మనల్ని మన గమ్యానికే చేర్చుతుందో లేక మధ్యలోనే ఎదురుగా వస్తున్న రైలును గుడ్డుకొంటుందో..లేక పట్టాలు తప్పి ఏ నదిలోనో పడిపోతుందో లేక అకస్మాత్తుగా మంటలు అంటుకొంటాయో ఎవరికీ తెలియదు… ఒకవేళ దేవుడు దయవల్ల ఇవేమీ జరుగకపోతే దారిలో ఎక్కడో దొంగలు రైల్లో ఎక్కి మీ దగ్గర ఉన్నదంతా దోచుకుపోవచ్చును…ప్రయాణికులు భగవంతుడు మీద భారం వేసి ప్రయాణించవలసిందే…బహుశః ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉందని రైల్వే వాళ్ళు గ్రహించినందునే ప్రయాణికులు రైల్వే స్టేషన్లో ప్రవేశించగానే వారికి దైర్యం చెప్పడానికే ”మీ ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది” అని భరోసా కల్పిస్తుంటారేమో…
ఇక విషయంలోకి వస్తే ముందే చెప్పుకొన్నట్లుగా నిన్న రాత్రి అనంతపురం జిల్లాలో గుత్తి రైల్వే స్టేషన్ అవుటర్ లో సిగ్నల్ కోసం నాందేడ్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగి ఉన్నప్పుడు రైల్లో దొంగలు పడి ప్రయాణికుల దగ్గర నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకొనిపోయారు. వాళ్ళు ఆ తరువాత వచ్చిన ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీకి ప్రయత్నించారు కానీ సిగ్నల్ పడి రైలు కదిలిపోవడం ప్రయాణికులు బ్రతికిపోయారు. రైళ్ళు ఆగినప్పుడు దోపిడీ దొంగలు ప్రయాణికులను భయబ్రాంతులను చేసేందుకు మొదట వారిపై రాళ్లు రువ్వారు. ఆ తరువాత అందినకాడికి దోచుకొని పోయారు. ఆ సమయంలో ఆ రెండు రైళ్ళలో రైల్వే పోలీసులు కూడా ఉన్నారు. కానీ ప్రయాణికులను దోపిడీ దొంగల బారి నుండి కాపాడలేకపోయారు. అటువంటప్పుడు వాళ్ళు ఉండి ప్రయోజనం ఏమిటో రైల్వే వాళ్ళకే తెలియాలి. రైల్వేలో సౌకర్యాలు కల్పించడం సంగతి ఏమో గానీ కనీసం ప్రయాణికులను భద్రంగా వారి గమ్యాలకు చేర్చితే అదే పదివేలు.