కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టినా తెలుగు రాష్ట్రాల్లో ఓ రకమైన అలజడి రేగుతుంది. తమ రాష్ట్రం పేరును కూడా కనీసం ప్రస్తావించలేదని రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు నిష్ఠూరమాడుతూ ఉంటారు. తమకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని చెబుతూ ఉంటారు. అయితే ఈ సారి ఏపీ నుంచి పెద్దగా ఎలాంటి విమర్శలు లేవు. టీడీపీ కూటమిలో ఉండటం వల్ల వచ్చినవి మహా ప్రసాదం అనుకుని సూపర్ అంటుంది. వైసీపీకి నోరు తెరిచే ఆప్షన్ లేదు.
అయితే తెలంగాణలో మాత్రం అటు పాలక పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా విమర్శలు చేస్తాయి. కానీ ఇక్కడ కొంచెం తేడా ఉంది. పాలకపార్టీ నేరుగా బీజేపీని విమర్శిస్తుంది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ను విమర్శిస్తుంది. ఏమీ తేలేకపోయారని అంటుంది. నేరుగా బీజేపీని విమర్శించరు. అయితే రెండు పార్టీల వాదన ఒకటే.. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదనే. నిజానికి ఒక్క బీహార్ పేరు తప్ప.. ఏ రాష్ట్రం గురించి నిర్మలా సీతారామన్ చెప్పలేదు. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రకటనలు చేశారు. మిగతా బడ్జెట్ అంతా కేంద్ర పథకాలు.. పన్నుల కేటాయింపులతో ఉంటుంది.
తెలంగాణకు చిల్లిగవ్వ రాకపోవడం అనేది ఏమీ ఉండదు. రాజ్యాంగ పరంగా కేటాయించాల్సిన కేటాయింపులన్నీ అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కేటాయించారు. కేంద్ర పథకాలను కూడా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఇస్తారు. అయితే కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఉండే సెస్సులు.. ఇతర నిధులతో ఏమైనా అదనంగా సాయం చేయాలనుకుంటే చేస్తుంది. అలాంటివి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని.. ప్రచారం చేసి రాజకీయ చేయడం తప్ప… ప్రతీ సారి ఇందులో అదే విషయం ఉంటుందని సామాన్యులు కూడా ఫిక్సయిపోయారు.