హైదరాబాద్: ప్రత్యేకహోదాపై ఆంధ్రప్రదేశ్ నాయకులు, హైకోర్టు విభజనపై టీఆర్ఎస్ నాయకులు ఇటీవల చేస్తున్న ఆందోళనలపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఇరు రాష్ట్రాలకూ న్యాయం చేస్తామని కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇవాళ లోక్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. వైసీపీ ఎంపీలు దీనిపై సభలో ఆందోళనకు దిగారు. వారు ప్లకార్డులతో వెల్లోకి దూసుకెళ్ళారు. దీంతో హోమ్ మంత్రి లేచి ఈ విషయంపై స్పందించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేయబోమని అన్నారు. హైకోర్టు విభజనపై న్యాయశాఖమంత్రి సమాధానమిస్తారని తెలిపారు. మరోవైపు వెంకయ్యనాయుడు ఇదే అంశంపై మాట్లాడుతూ, ప్రత్యేకహోదా అనేది విభజనచట్టంలో లేదని, అయినాకూడా తాము ఇచ్చిన హామీమేరకు దానిని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆర్థికసంఘం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖ కసరత్తు చేస్తోందని చెప్పారు.