రాష్ట్రపతి ఎన్నికలు ముందు ఉండగా ఎవరైనా కేంద్ర మంత్రి వస్తే.. తమను అభినందించి పోతారని వైసీపీ నేతలు అనుకున్నారు. కానీ వచ్చిన ఒక్క మహిళా కేంద్ర మంత్రి ” వెరీ బ్యాడ్ ” అని ఫీడ్ బ్యాక్ ఇచ్చి వెళ్లారు. కేంద్ర మంత్రి స్పందనతో వైసీపీ నేతలకు తలలు ఎక్కడ పెట్టుకోవాలో ఆర్థం కాలేదు. కేంద్ర ఆరోగ్య మంత్రి భారతి ప్రవీణ్ పవార్ విజయవాడ ఆస్పత్రిని సందర్శించారు. విజయవాడలో వివిధ కార్యక్రమాల అమలు తీరును ఆమె పరిశీలించారు.
కేంద్ర మంత్రి వెంట ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడ ఉన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పర్యటిస్తున్న సమయంలో ఆమె అక్కడి బోర్డులను పరిశీలించారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం బోర్డులు ఉన్నాయి కానీ.. పీఎం నరేంద్ర మోదీ ఫొటో లేదు. దీంతో ఆమె అసహనానికి గురయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో స్కీమ్ అమలు చేస్తూ.. ప్రధాని ఫోటో ఎందుకు లేదని భారతి ప్రవీణ్ పవార్ .. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమీషనర్ నివాస్‌ను నిలదీశారు.
సెంట్రల్ స్కీమ్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణును కూడా కేంద్ర మంత్రి ప్రశ్నించారు. వారెవరూ పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోయారు. నీళ్లు నమలడంతో వెరీ బ్యాడ్ ని ఆమె వ్యాఖ్యానించారు. తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోని టెలిమెడిసిన్ హబ్ , ఆయుష్మాన్ భారత్ , ఈ సంజీవని హాస్పటల్ , జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్ లను ఆమె పరిశీలించారు. ఎక్కడా ప్రధానమంత్రి ఫోటో కనిపంచలేదు. దీంతో అమె అసహనంతో వెనుదిరిగారు. ఇప్పటికే కేంద్ర పథకాలకు రాష్ట్రం స్టిక్కర్లేసుకుంటోందన్న విమర్శలు వస్తున్న సమయంలో కేంద్రమంత్రి ఏమైనా .. ప్రధానికి రిపోర్ట్ ఇస్తే పతకాల పేర్లు మార్చాలని ఆదేశిస్తారేమోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో ప్రారంభమయింది.