బిహార్ ఎన్నికలపై వివిధ మీడియా సంస్థలు నిన్న వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో చాణక్య, ఇండియా టుడే మరొకటి రెండు సంస్థలు తప్ప మిగిలినవన్నీ నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ ల మహాకూటమికే విజయావకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పేసాయి. అవి చెప్పినా చెప్పకపోయినా ఆ సంగతి బీజేపీ నేతలకి కీలకమయిన రెండు-మూడవ దశల ఎన్నికల సమయంలోనే తెలిసిపోయింది. అందుకే అప్పుడే ముందు జాగ్రత్తగా ఈ ఎన్నికలు మోడీ పరిపాలనకు రిఫెరెండం కావని ప్రకటించేసారు.ఎన్నికలలో ఓడిపోతే మోడీకి మరింత అప్రదిష్ట కలుగుతుందని, మూడవ దశ ఎన్నికల తరువాత మోడీకి బదులు కేంద్రమంత్రులను, స్థానిక నేతలను ముందుకు తీసుకువచ్చేరు. కానీ దాని వలన ఇంకా ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహించి మళ్ళీ నరేంద్ర మోడీని మళ్ళీ రంగంలోకి దించారు. కానీ అప్పటికే జరుగవలసిన డ్యామేజి జరిగిపోయినట్లుంది. అందుకే బీజేపీ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఇది చూసి కంగారు పడుతున్న బీజేపీ నేతలు నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ లు “ఫౌల్ గేమ్” అడేరని ఆరోపించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తూ సమస్యలపై నుండి ప్రజల దృష్టిని మళ్ళించారని కేంద్రమంత్రి మరియు బిహార్ ఎన్నికల ఇన్-చార్జ్ అనంతకుమార్ ఆరోపించారు.
ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ పాలనకు రిఫెరెండం కావని, అయితే గియితే అవి నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ ల ఆటవిక పరిపాలనకే రిఫరెండం అవుతాయని అన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి తామేమీ భయపడటం లేదని, ఒకవేళ అవే నిజమనుకొన్నట్లయితే వాటిలో చాణక్య న్యూస్ ఎన్డిఏకు 155 స్థానాలు, మహాకూటమికి 83 స్థానాలు, ఇతరులకు 5 స్థానాలు దక్కే అవకాశాలున్నాయని చెప్పిన విషయం కూడా మరిచిపోకూడదని అన్నారు. బిహార్ లో ఎన్డిఏ కూటమే తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఎల్లుండి అంటే నవంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తాము ఎదురుచూస్తామని అన్నారు.
అనంతకుమార్ మాటలే బీజేపీ ఓటమిని అంగీకరించినట్లు దృవీకరిస్తున్నాయి. నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ లు “ఫౌల్ గేమ్” అడేరని ఆయన ఆరోపించడం చాలా హాస్యాస్పదం. ఈ ఎన్నికలు మొదలుకాక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ఎవరూ అడగకపోయినా బిహార్ రాష్ట్రానికి ఏకంగా రూ.1.65లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి “ఫౌల్ గేమ్” మొదలుపెట్టారు. కనుక ఓటమి అంచులో నిలబడి ఇప్పుడు ప్రత్యర్ధులు “ఫౌల్ గేమ్” ఆడేరని బాధపడటం అనవసరం. ఒకవేళ ఈ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినట్లయితే అప్పుడు మోడీ ప్రకటించిన ఆ రూ.1.65లక్షల కోట్లు “ఫౌల్ గేమ్” ఆడి గెలిచినందుకు నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ ల ప్రభుత్వానికి బహుమతిగా ఇస్తారా? లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ హామీలను చెత్తబుట్టలో పడేసినట్లే, ఈ రూ.1.65లక్షల కోట్ల హామీని కూడా చెత్తబుట్టలో పడేస్తారా…వేచి చూడాల్సిందే!