పోలవరం ప్రాజెక్ట్ టెండర్లను ఏపీ సర్కార్ రద్దు చేయడంపై.. కేంద్ర జలశక్తి మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వేసిన ప్రశ్నకు.. జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ సమాధానం ఇచ్చారు. పోలవరం టెండర్లు రద్దు చేసిన విషయం తనను అత్యంత ఆవేదనకు గురి చేసిందని.. షెకావత్ లోక్‌సభలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ విధంగా టెండర్లు రద్దు చేయడం.. అత్యంత బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రాజెక్ట్‌కు కొత్త అవరోధంగా మారుతుందని స్పష్టం చేశారు. మళ్లీ టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. రివర్స్ టెండరింగ్ అంటున్న ఏపీ ప్రభుత్వ వైఖరిని కూడా ఆయన తప్పు పట్టారు. రీటెండర్ల వల్ల ప్రాజెక్ట్ ఖర్చు కచ్చితంగా పెరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందని అందరూ కేంద్రాన్నిఅడుగుతున్నారని.. కానీ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని షెకావత్ తేల్చి చెప్పారు.
గతంలో పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరగలేదని కేంద్రం తేల్చి చెప్పింది. అయినప్పటికీ.. ఏపీ సర్కార్ నిపుణుల కమిటీని నియమించి.. నిబంధనలకు విరుద్ధంగా.. పనులు వివిధ సంస్థలకు అప్పగించారంటూ… వాటిని క్యాన్సిల్ చేసింది. స్పిల్ వే, విద్యుత్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్న నవయుగ కంపెనీకి టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. పనులు నిలిపివేసి వెళ్లిపొమ్మని సూచించారు. రెండు వారాల్లో రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని… రూ. పదిహేను వందల కోట్లు ఆదా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఇప్పుడు.. కేంద్రం.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ప్రమేయం లేకుండా టెండర్లను రద్దు చేయడం.. కేంద్రానికి ఇష్టం లేదని.. కేంద్ర జలశక్తి మంత్రి వాదనతో తేలిపోయింది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం టెండర్లను మళ్లీ పిలిచి… అంగీకరించి… పనులు ప్రారంభమయ్యేలా చేయడానికి… ఆరేడు నెలల సమయం అయినా పడుతుందన్న అంచనాలున్నాయి.
అప్పటి వరకూ పోలవరం పనులు ఆగిపోతాయి. అదే సమయంలో.. ఖర్చు ఆదా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. అధిక భారం ఖాయమని కేంద్రం చెబుతోంది. పెరిగే ఖర్చును ఎవరు భరించాలన్నది కూడా తర్వాత వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో.. కాంట్రాక్టును రద్దు చేసింది కాబట్టి.. రాష్ట్రమే భరించాలని కేంద్రం అంటుంది. కానీ చట్టం ప్రకారం వంద శాతం.. కేంద్రమే భరించాలని రాష్ట్రం వాదిస్తుంది. చివరికి ఈ ప్రాజెక్ట్ మొత్తానికే వివాదాల్లో మునిగి ముందుకు వెళ్లడం కష్టమన్న అభిప్రాయం.. ఏర్పడుతోంది.