అదిగో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు..ఇదిగో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు.. వైసీపీ గత మూడు నెలల కాలంగా తరుచూ వినిపిస్తున్న డైలాగ్ ఇదే. ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తెరమీదకు వచ్చిన సమయంలోనూ స్టీల్ ప్లాంట్ అమ్మకం తెరచాటుగా జరుగుతోందని దాన్ని సైడ్ ట్రాక్ చేసేందుకు లడ్డూ వివాదాన్ని సృష్టించారని వైసీపీ ఆరోపించింది. ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ పోటీ పడి మరీ వాయిస్ వినిపించాయి. గత ఆరోపణలు ఎలా ఉన్నా.. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేసిన ట్వీట్ కు బదులుచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి కేంద్రమంత్రి కుమారస్వామి తెరదించారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారన్న విషయం నా దగ్గరికి వచ్చిన 48గంటల్లోనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. సెప్టెంబర్ 27న తొలగించిన 4,200మంది కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను సెప్టెంబర్ 29నే విధుల్లోకి తీసుకున్నాం అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ విషయంలో స్వార్థ రాజకీయాలు మానేయాలని కాంగ్రెస్ కు హితవు పలికారు కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తోందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు రద్దు చేసిన 3,700 కాంట్రాక్ట్ లేబర్ పాస్ లను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. గతంలో ఎపీ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయబోమని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ ప్రచారం ఆగకపోవడంతో..తాజాగా మరోసారి ఆయన ఈ వ్యాఖ్యలను ఖండించారు.