ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో నిర్మించతలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టులలో విజయవాడ ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేయలేమని కొన్ని వారాల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఒక లేఖ వ్రాసింది. మెట్రో రైల్ ప్రాజెక్టు లాభసాటిగా నడవాలంటే కనీసం 20 లక్షల జనాభా ఉండాలని, కానీ విజయవాడలో అంత జనాభా లేనందున ఆ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయలేమని ఆ లేఖలో తెలియజేసింది. కానీ దానికి కూడా కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఇదివరకు ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన ఇదేవిధంగా మాట్లాడి చాలా గందరగోళ పరిస్థితులు సృష్టించారు.
విజయవాడ మెట్రో ప్రాజెక్టు లాభసాటి కాదు కనుక దానికి నిధులు మంజూరు చేయలేమని కేంద్రప్రభుత్వం విస్పష్టంగా లేఖ వ్రాసినప్పుడు, ఆయన ఈ ప్రాజెక్టుని కేంద్రప్రభుత్వం ఆమోదించిందని చెపుతున్నారు. అంటే కేంద్రప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి కూడా నిధులు మంజూరు చేయబోతోందా? లేకపోతే దీనికి పెట్టుబడులు సమకూర్చడానికి సంసిద్దత వ్యక్తం చేసిన జపాన్ కి చెందిన ‘జైకా సంస్థ’ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీగా ఉండి, అందుకు అవసరమయిన అన్ని అనుమతులు మంజూరు చేయబోతోందా? లేకపోతే విజయవాడ మెట్రో ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేయనప్పటికీ దాని నిర్మాణానికి అవసరమయిన అన్ని రకాల అనుమతులు కేంద్రప్రభుత్వం మంజూరు చేయబోతోందా? ప్రత్యేక హోదా విషయంలో ‘యూ టర్న్’ తీసుకొన్న కేంద్రప్రభుత్వం, విభజన చట్టంలో హామీ ఇవ్వబడిన ఈ మెట్రో ప్రాజెక్టులలో విజయవాడ ప్రాజెక్టుపై కూడా ‘యూ టర్న్’ తీసుకోవడంతో రాష్ట్ర ప్రజలు మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుశః ఆ కారణంగానే కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని విజయవాడ మెట్రో ప్రాజెక్టుకి కూడా నిధులు విడుదల చేయాలనుకొంటోందా? అనే సందేహాలను వెంకయ్య నాయుడే నివృత్తి చేయవలసి ఉంటుంది. ఏమయినప్పటికీ విజయవాడ మెట్రో ప్రాజెక్టుకి కూడా కేంద్రప్రభుత్వం నిధులు అందిస్తే ఆంద్రప్రదేశ్ పై రుణభారం తగ్గుతుంది. ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.