ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా తెలంగాణను కించ పరిచేలా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజ్యసభలో ధాన్యం కొనుగోలు అంశంపై మరోసారి మాట్లాడిన పీయూష్ గోయల్ తెలంగాణ ధాన్యాన్ని దేశంలో ఇతరులు ఎవరు తినరన్నట్లుగా మాట్లాడారు. పంజాబ్ బియ్యాన్ని వంద శాతం సేకరిస్తున్నామని.. కేసీఆర్ అంటున్నారని.. అయితే పంజాబ్ బియ్యాన్ని దేశం మొత్తం తింటారన్నారు. అలాంటి ముడి బియ్యమే అయితే.. ఇతర రాష్ట్రాలలో తినగలిగే బియ్యాన్ని మాత్రమే సెంట్రల్ పూల్ కింద కేంద్రం తీసుకుంటుందన్నారు.
అవసరం లేకుండా బియ్యం తీసుకుని కేంద్రం ఏం చేయాలని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ముడి బియ్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతి చేసే పరిస్థితి లేదన్నారు. ఇతర వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా… పీయూష్ గోయల్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో పండే బియ్యం అంత నాణ్యత లేకుండా ఉంటాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన నూకలు తినమని తెలంగాణ ప్రజల్ని అవమానించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
ఇప్పుడు కూడా తెలంగాణ బియ్యాన్ని లోకల్‌గానే పంపిణీ చేసుకోవాలని సలహాలిచ్చారు. పీయూష్ గోయాల్ ఏం చెప్పాలనుకుంటున్నారో కానీ అంతిమంగా దేశవ్యాప్తంగా పంపిణీ చేయడానికి తెలంగాణ బియ్యం పనికిరావని నేరుగానే చెబుతున్నారు. ఇదే చర్చనీయాంశం అవుతోంది.