ఏపీ ఉద్యోగులు , ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. సమస్యను ఏ మాత్రం సానుకూలంగా చూడకపోగా ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా సీఎస్ ప్రెస్మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడంతో ఉద్యోగ సంఘాలు ఇక పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నాయి. గురువారం అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై.. సమ్మె నిర్ణయాన్ని తీసుకుంటాయని.. శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదాయం పడిపోయిందని ప్రభుత్వం అదే పనిగా చెబుతున్న మాటల్ని ఉద్యోగులు కొట్టి పడేస్తున్నారు.
ఊహించినంతగా ఆదాయం పెరుగుతోందని లెక్కలు చెబుతున్నారు. కాగ్ లెక్కలే దానికి సాక్ష్యమంటున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ చేతకాక ఆ కష్టాన్ని తమపై రుద్దుతున్నారని అంటున్నారు. ఇప్పుడు పీఆర్సీకి అంగీకరిస్తే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. అందుకే సమ్మె చేయాలని భావిస్తున్నారు. అయితే ఉద్యోగుల విషయంలో ఏ మాత్రం సీరియస్గా లేని ప్రభుత్వం ఏం చేసుకుంటారో చేసుకోమన్నట్లుగా ఉంది. వాళ్లు సమ్మె చేసి ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే.. ప్లాన్ బీ రెడీ చేసుకునే పనిలో ప్రభుత్వం ఉంది.
ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అన్ని పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. వారు కూడా సమ్మెలోకి వెళ్తే వాలంటీర్లు రెడీగా ఉన్నారు. ఇంకా కావాలంటే తాత్కాలిక నియామకులు జరుపుకుని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలపై ఉద్యోగ సంఘాలు మరింత గుర్రుగా ఉన్నాయి. రాబోయే వారం రోజుల్లో ఉద్యోగులు – ప్రభుత్వ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.