తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల విక్రయం నిలిచిపోయింది. తాము అడిగినంత ధరలు పెంచడం లేదని పైగా బిల్లులు కూడా ఇవ్వడం లేదని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ తాము తెలంగాణలో అమ్మకాలు చేసేందుకు సిద్ధంగా లేమని చెబుతూ నేరుగా సెబీగా లేఖ రాసింది. ఈ లేఖ వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.వెంటనే ఎక్సయిజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీర్ల కంపెనీ భారీగా రేట్ల పెంపు అడుగుతోందని అలా చేస్తే వినియోగదారులపై భారం పడుతుందన్నారు. అందుకే ఆలోచిస్తున్నామన్నారు.
అయితే మందుబాబులకు కావాల్సింది కారణాలు కాదు.. బీర్లు. కింగ్ ఫిషర్ బీర్లు. బీర్లలో కింగ్ ఫిషర్ అనేది బాహుబలి బ్రాండ్. అమ్మకాల్లో ఎక్కువ వాటా ఆ బ్రాండ్ కే ఉంటుంది. సహజంగా బీర్ కోసం వెళ్లేవారు ఆ బ్రాండ్ అడుగుతారు. ఇప్పుడు తెలంగాణలో ఆ బ్రాండ్ బీర్ లేకపోతే మందుబాబులు అసంతృప్తికి గురవుతారు. అంతే కాదు ప్రభుత్వ పెద్దలే తమ బినామీకంపెనీలతో బూమ్ బూమ్ బీర్లు అమ్మేందుకు ఇలాంటి ప్లాన్లు అమలు చేస్తోందని అనుమానించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హరీష్ రావు లాంటి వాళ్లు దీనిపై విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడింది. బిర్యానీలనీ.. అదనీ.. ఇదనీ విచిత్రమైన బ్రాండ్లతో కొన్ని బీర్లు మార్కెట్లోకి వచ్చాయి. వివాదం ఏర్పడటంతో వాటిని ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ కింగ్ ఫిషర్ బీర్లు యధావిధిగా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా అమ్మకాలు నిలిపివేస్తూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ బీర్లు మళ్లీ అందుబాటులోకి రాకపోతే మందుబాబులు తీవ్ర అసంతృప్తికి గురవుతారు. అది ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ అనుభవం ఎలాంటిదో ఇప్పటికే పొరుగు రాష్ట్రంలో ఓ పార్టీ చూసింది. అందుకే కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.