ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నెలలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ టూర్లో ఆయన ఐక్యరాజ్యసమితిలో ప్రసంగానికి ఆహ్వానం వచ్చింది. “ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్ట్యూనిటీస్స్” అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాల్సిందిగా చంద్రబాబును యూఎన్ఓ ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు వచ్చే నెల 24న న్యూయార్క్‌లో యూఎన్ఓ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది. 2024లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగు బాట పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి యూఎన్ఓ సాయం చేయనుంది. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్నవారికి చంద్రబాబు తన గళం వినిపించాలని ఐక్యరాజ్యసమితి కోరింది.
కొద్ది రోజుల క్రితం.. న్యూయార్క్ టైమ్స్ పత్రిక… ఏపీలో ఉద్యమంలా సాగుతున్న “జీరో బడ్జెట్ ఫార్మింగ్” అంశంపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది.ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌పై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రసాయనేతర వ్యవసాయానికి ముందడుగు వేసిన చంద్రబాబు కృషిని ప్రశంసించింది. రసాయనాల జోలికి వెళ్లకుండా… ప్రకృతి సిద్ధంగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలనుకున్న చంద్రబాబు సుభాష్ పాలేకర్ ను ఏపీకి సలహాదారుగా నియమించారు. ఆయన సూచనలతో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కి ఏపీ వ్యాప్తంగా రైతులు శ్రీకారం చుట్టేలా చేశారు. ఇప్పటికే దీనిపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఏపీ రైతుల విజయాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేస్తోంది. దేశంలోనే ఏపీ మొట్టమొదటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ స్టేట్ గా ప్రశంసలు కూడా ఇచ్చింది.
రైతులను ప్రకృతి సిద్ధమైన సేద్యం కోసం ఏపీ ప్రభుత్వం రూ. 2500 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే సుమారు లక్ష మంది రైతులు జీరో బడ్జెట్‌తో సహజసిద్ధంగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి ఈ సంఖ్య 5 లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపనున్నారు. రాబోయే ఐదేళ్లలో 60 లక్షల మంది రైతులు ఇదే విధానం ద్వారా సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని.. జీరో బడ్జెట్ ఫార్మింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నాయి.