తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనను సక్సెస్ చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలందరూ ఏకతాటిపైకి వచ్చారు. ఏర్పాట్లను స్వయంగా చూసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి,
మధు యాష్కీ అందరూ కలిసి సభా నిర్వహణ చూసుకుంటున్నారు. తెలంగాణ లో ప్రతీ మార్పుకు పునాది ఓరుగల్లు నుండే పడుతుందని వారు ధీమా వ్య్కతం చేస్తున్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనను పూర్తి స్థాయిలో హైలెంట్ చేసేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్కు ప్రతీ సారి వరంగల్ సభలే బూస్ట్ ఇచ్చాయి.
కానీ ఇటీవల వరంగల్లో భారీ సభ పెట్టాలని ప్రయత్నించి టీఆర్ఎస్ విఫలమయింది. తమ భూముల్లో సభను పెట్టుకునేందుకు రైతులు అంగీకరించకపోవడంతో వివాదం అయింది. రెండు సార్లు వాయిదా వేసుకున్న తర్వాత ఇక సభ ఆలోచన చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వరంగల్లో గతంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభల కంటే భారీగా సభ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. వరంగల్ కాంగ్రెస్ నేతల్లో అనైక్యత ఉంటే సర్దుబాటు చేస్తున్నారు.
ఇటీవల సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. అందరితో విబేధాలు సర్దుబాటు చేశామనుకున్న తర్వాతనే ఆయన తెలంగాణకు వచ్చేందుకు అంగీకరించారు. ఇప్పుడుదానికి తగ్గట్లేగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తే అది సక్సెస్ అయితే క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వెళ్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని.. క్రెడిట్ అందరికీ వస్తుందని.. అందుకే కలసి కట్టుగా పని చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.