త్రివిక్రమ్‌పై ప్రత్యేకమైన ప్రేమ, అభిమానాలు ఎందుకంటే – ఆయనో సాహితీ ప్రేమికుడు. ఎప్పుడు మాట్లాడినా పుస్తకాలు, అక్షరాలపై ప్రేమ కనిపిస్తుంటుంది. తన సినిమాల్లో సంభాషణల్లోనూ ఎప్పుడూ, ఎక్కడా ద్వంద్వార్థాలు దొరకవు. ప్రతి అక్షరంలోనూ సంస్కారం ధ్వనిస్తుంది. పాటల్లో కూడా అంతే. మిగిలిన సినిమాల్లో పాటలు వేరు, త్రివిక్రమ్ సినిమాల్లో పాటలు వేరు. ఆ శబ్ద సౌందర్యం బాగుంటుంది. రచయిత ఎవరైనా సరే, అక్కడ కూడా త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది.
ఆయన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ నుంచి రెండు పాటలు వచ్చాయి. ట్యూను పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ, సాహిత్యం మాత్రం త్రివిక్రమ్ స్థాయికి తగ్గట్టుగా కుదిరాయి. కానీ… ఇప్పుడు ఓ పాట వస్తోంది. పాట ప్రోమోలో ‘కుర్చీని మడతపెట్టి’ అనే వాక్యం మాత్రం వినిపించింది. దాన్నే హైలెట్ చేశారు కూడా. అయితే ఈ కుర్చీని మడత పెట్టి అనేది ఏదైతే ఉందో.. దాని గురించి సోషల్ మీడియా ట్రోల్స్ ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆ వాక్యం ఏ పదంతో పూర్తవుతుందో కూడా వాళ్లకు అవగాహన ఉంది. ఇప్పుడు దాన్నే ఓ సినిమా పాటకు లీడ్ గా తీసుకోవడం, అది కూడా మహేష్ లాంటి అగ్ర హీరో నటించిన సినిమాకి, అందులోనూ త్రివిక్రమ్ లాంటి సాహితీ ప్రేమికుడు దర్శకత్వం వహించిన చిత్రంలో వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బహుశా… ఈ పాట త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోవాలన్న ఆత్రంతో ఫ్యాన్సీ పదాలను పట్టుకొన్నారేమో..? అయితే అంత ఖర్మ త్రివిక్రమ్ – మహేష్ సినిమాలకు ఉందా? అనేది ప్రశ్నార్థకం. ఏ అల్లరి నరేష్ సినిమాల్లోనో ఇలాంటి పద ప్రయోగాలు ధ్వనిస్తే… కామెడీ కోసం కదా అని లైట్ తీసుకోవొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా? పాటలోని ప్రారంభ వాక్యమే ఇలా ఉంటే, మిగిలిన పాట ఇంకెలా ఉందో..? వచ్చాక ఇంకెన్ని విమర్శలకు తావిస్తుందో?