ఎట్టకేలకు..దాదాపుగా ఆరు నెలల గ్యాప్ తర్వాత సినిమా ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్ 5.0లో భాగంగా..అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ప్రారంభించుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఉన్న సీట్లలో సగం మాత్రమే బుకింగ్‌కు అనుమతించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్స్‌కు కూడా అనుమతి ఇచ్చారు. అయితే కమర్షియల్ పూల్స్‌కి కాకుండా… క్రీడాకారులకు ట్రైనింగ్ ఇచ్చే వాటికి మాత్రం అనుమతి ఇచ్చారు. ఫుడ్ కోర్టులు,బార్లు,రెస్టారెంట్లు యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో ఐదో తేదీ నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
స్కూళ్లను మాత్రం అక్టోబర్ పదిహేనో తేదీ వరకూ మూసి ఉంచుతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు. తల్లిదండ్రుల అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిఉంటుంది. కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రం యధావిధిగా ఆంక్షలు అమలవుతాయి.అన్‌లాక్ ఫోర్ మార్గదర్శకాల్లో భాగంగా పాఠశాలలను పాక్షికంగా తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు బడికి వెళ్లి ఉపాధ్యాయులను సంప్రదించే అవకాశం ఇచ్చారు. ఆరు అడుగుల సామాజిక దూరం పాటిస్తూ డౌట్స్ తీర్చుకోవచ్చన్నారు. అందరూ మాస్కులు ధరించాలని ఆదేశించారు.
ఇప్పటికి నాలుగు విడుతలుగా కేంద్రం అన్‌లాక్ నిబంధనలు విడుదల చేసింది. దీంతో దేశంలో జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. అయితే ఎక్కువ ఎక్కువగా గుమికూడే ప్రాంతాలు అయిన సినిమాళ్లు, స్కూళ్లు,ఎంటర్ టెయిన్మెంట్ పార్కుల విషయంలోఇంకా ఆంక్షలు ఉన్నాయి. పదిహేనో తేదీ నుంచి వాటిని కూడా తొలగిస్తారు. కంటెయిన్మెంట్ జోన్లలో నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు కానీ..ఇప్పుడు అలాంటి కంటెయిన్మెంట్ జోన్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. అన్‌లాక్ ఫోర్లో భాగంగా పర్యాటక కేంద్రాలకు అనుమతించారు. జూలైలోనే తాజ్ మహల్ సందర్శనకు అనుమతించిన కేంద్రం రోజుకు ఐదు వేల మంది మాత్రమే వెళ్లాలని పరిమితి విధించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లేకుండానే పర్యాటకులు రావచ్చని తెలిపింది. అన్‌లాక్ 5.0 తర్వాత చాలా పరిమితంగానే ఆంక్షలు అమలు కానున్నాయి.