సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు యావజ్జీవ శిక్ష విధించింది.. ఢిల్లీ తీస్ హజారీ కోర్టు. యావజ్జీవ శిక్షతో పాటు రూ.25లక్షలు జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కుల్దీప్ సెంగార్.. బీజేపీ ఎమ్మెల్యే. ఆయన రేప్ కేసులో అరెస్టయినప్పటికీ ఆయనను బీజేపీలోనే కొనసాగించారు. అయితే..రేప్ బాధితురాలి హత్యకు కుట్రపన్ని ప్రమాదం చేయించారన్న ఆరోపణలు రావడం..రాజకీయ దుమారం రేగడంతో.. ఆరునెలల క్రితం సెంగార్‌ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించిది. 2017లో ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్యోగం ఇప్పిస్తానని 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్, అతడి అనుచరులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. 17 రోజుల తర్వాత మాత్రమే బాధితురాలి ఆచూకీని కుటుంబ సభ్యులు గుర్తించారు.
2018 ఏప్రిల్ 3న అత్యాచార బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే సెంగార్ సోదరుడు.. తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. కేసును ఉపసంహరించుకోకుంటే చంపేస్తామంటూ బెదిరించాడు. అక్కడితో ఆగకుండా అతడిపై అక్రమ ఆయుధాల కేసు పెట్టించాడు. ఈ ఘటన తర్వాత తనకు న్యాయం చేయాలంటూ గతేడాది ఏప్రిల్ 8న బాధితురాలు సీఎం యోగి కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అయితే ఆ మరుసటి రోజే బాధితురాలి తండ్రి పోలీసుల కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో మూడు రోజుల తర్వాత సెంగార్, అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్యే సెంగార్ జైల్లో ఉండగానే బాధితురాలపై హత్యాచార యత్నం జరిగింది. కేసు విచారణకు హాజరయ్యేందుకు వెళుతున్న బాధితురాలి కారును నెంబర్ లేని లారీ ఢీకొట్టింది. దాంతో ఆమెతో పాటు లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలి ఇద్దరి బంధువులు మృతిచెందారు. సుప్రీం కోర్టు చొరవతో కేసులను లక్నో నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. చివరకు ఈ కేసులో ఎమ్మెల్యే సెంగార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. చివరకు యావజ్జీవిత శిక్షతో సరి పెట్టారు.