`ది ఫ్యామిలీ మెన్ 2` ట్రైలర్ అందరికీ నచ్చింది. ఒక్క తమిళులకు తప్ప. తమిళులంటే అందరూ కాదు. ఓవర్గం.. తమ మనోభావాలు దెబ్బతిన్నవంటూ ఆక్రోశం చూపించింది. తమిళ చరిత్రని తప్పుదోవ పట్టిస్తూ.. ఈ వెబ్ సిరీస్ ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ వెబ్ సిరీస్ ని బ్యాన్ చేయాలంటూ గొడవ చేసింది. లాక్ డౌన్ ఉంది గానీ, లేదంటే ధర్నాలూ, రాస్తారోకోలూ కూడా జరిగేవి. సోషల్ మీడియాలో అంతకంటే తక్కువ గొడవేం జరగలేదు. ముఖ్యంగా సమంతని తమిళ తంబీలు విపరీతంగా ట్రోల్ చేశారు. తమిళవాసి అయ్యుండి, ఇలాంటి కథలో ఎలా నటిస్తావ్? అని అంతా ఎద్దేవా చేశారు.
అయితే ఇప్పుడు `ది ఫ్యామిలీమెన్ 2` వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్… తొలి సీజన్లానే సూపర్ హిట్టయ్యింది. సమంత సూపర్.. అంటూ కామెంట్లు, కాంప్లిమెంట్లూ వినిపిస్తున్నాయి. తమిళ తంబీలు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఈ వెబ్ సిరీస్లో… తమని, తమ జాతినీ, తమ భాషనీ. చరిత్రనీ కించపరిచే పాయింట్లు ఏమీ లేకపోవడంతో గమ్మునుండిపోయారు. నిజానికి ఫ్యామిలీమెన్ 2 బయటకు వచ్చాక.. ఈ గొడవలు ఎక్కువ అవుతాయనుకున్నారంతా. కానీ.. రూపకర్తలు అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ట్రైలర్ చూసి, ఓ అభిప్రాయానికి రావొద్దు. వెబ్ సిరీస్ చూసి మాట్లాడండి అంటూ రాజ్ డీకేలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. సమంత కూడా ఈ వివాదం గురించి మాట్లాడి, దాన్ని పెద్దది చేయడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. ఇప్పుడు వెబ్ సిరీసే అందరికీ సమాధానం చెబుతోంది. ట్రైలరో, టీజరో చూసి… ఆ ప్రయత్నంపై ఓ అభిప్రాయానికి రావడం సరికాదన్న విషయం… `మనోభావాలు దెబ్బతినే వర్గానికి` మరోసారి గట్టిగా చెప్పింది… ఫ్యామిలీ మేన్.