హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ అధినేత బుర్హాన్ వనీ భద్రతాదళాల చేతిలో హతమయినప్పటి నుంచి కాశ్మీర్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీనగర్, కాశ్మీర్ లో చాలా ప్రాంతాలలో 3రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది.
అయినప్పటికీ ఇంకా పరిస్థితులు చాలా ఉద్రిక్తంగానే ఉన్నాయి. గత మూడు రోజులుగా శ్రీనగర్ మరి కొన్ని ప్రాంతాలలో మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. కాశ్మీర్ వేర్పాటువాదులకి భద్రతాదళాలకి మద్య ఘర్షణలలో ఇంతవరకు 23మంది చనిపోయారు. అంటే బుర్హాన్ వనీ ఒంటరిగా పోలేదు తనతో బాటు మరో 23 మందిని వెంట తీసుకుపోయాడని స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఈ గొడవలు శ్రీనగర్ లో వేర్పాటువాదం ఎంత బలంగా ఉందో కళ్ళకి కట్టినట్లు చూపుతోంది. ఒక ఉగ్రవాది కోసం వేర్పాటువాదులు ఇంతగా రెచ్చిపోతున్నారంటే అందుకు కారణం రాజకీయ పార్టీలు వారికి అండగా నిలబడటమే. ఇంతవరకు జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్) ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న మహబూబా ముఫ్తీ (పి.డి.పి.) ఇద్దరూ కూడా తమ రాజకీయ అవసరాల కోసం వేర్పాటువాదులని ప్రోత్సహించుతూనే ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రులే వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నపుడు, ప్రజలు ఆ ప్రభావానికి గురికాకుండా ఉండగలరా? ప్రజలు, ముఖ్యంగా యువత దానివైపు మళ్ళకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ,ఉపాధి అవకాశాలని పెంచేందుకు చాలా ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎవరూ అడగకుండానే జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి గత ఏడాది రూ.80,000 కోట్లు ఆర్దికప్యాకేజి మంజూరు చేశారు. కానీ దాని వలన ఎటువంటి ప్రయోజనం కలుగకపోగా కాశ్మీర్ లో వేర్పాటువాదం నిర్మూలించలేనంతగా ప్రబలిపోయింది. త్వరలో ఈ ఉద్రిక్త పరిస్థితులు చల్లారినప్పటికీ వేర్పాటువాదాన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు కనుక ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అందుకు ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో బాటు ఆమె ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతునందుకు భాజపా కూడా బాద్యత వహించాల్సి ఉంటుంది.