వైసీపీ ఇమేజ్ ప్రజల్లో ఓ మాదిరిగా పడిపోయింది. ఆ పార్టీకి చెందిన ఏ స్థాయి ప్రజాప్రతినిధులు చూసినా దారుణమైన నేరాలు చేసిన వ్యక్తులు. చిన్న చిన్న ఊళ్లల్లో కౌన్సిలర్లుగా ఆ పార్టీ గెలిపించిన వారిని చూసినా… పెట్టీ కేసుల దగ్గర్నుంచి తీవ్రమైన కేసులు ఉన్న వారు ఎందరో కనిపిస్తారు. అలాంటి వారుఎలాంటి నేరాలు చేసినా.. వారికి చట్టం వర్తించడం లేదు. వారిని చూసి ప్రజలు భయపడుతున్నారు. అదే సమయంలో వారి నిర్వాకాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు.
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం మొదటిది కాదు.. చివరిది కాదు. ఆయన వ్యక్తిత్వం.. వివాదాస్పద నైజం మొత్తం తెలిసి కూడా ఆయనతో పొలిటికల్ గేమ్ ఆడించి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ఇష్టారీతిన మాట్లాడి ఆయన ప్రజల్లో పలుచన అవడమే కాదు.. పార్టీ పరువు కూడా తీశారు. ఇప్పుడు అడ్డగోలుగా దొరికిపోయారు. ఆయన బుకాయించినా ఆ వీడియో నిజమో కాదో తెల్సుకోవడం పెద్ద విషయం కాదు. అయితే ఇలాంటి వారందర్నీ వైసీపీ పెద్దలు ఉపేక్షిస్తూండటం వల్లనే సమస్యలు వస్తున్నాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళల్ని వేధిస్తున్న వైసీపీ నేతల గురించి అన్ని స్థాయిల్లో ఆరోపణలు ఉన్నాయి. అత్యున్నత స్థాయిలోనూ ఈ ఆరోపణలు ఉన్నాయి. బయటపడిన వారే దొంగలు . ఇప్పటి వరకూ ఇలాంటి ఆరోపణలపై.. పార్టీ పరంగా విచారణ చేయించడమో.. ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడమో చేసి చర్యలు తీసుకుని ఉంటే ఇతర నేతలు కాస్త భయంతో ఉండేవారు. కానీ అలా చేయలేదు. అంబటి రాంబాబు తీరుపై ఆడియోలు వైరల్ అయితే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సత్కరించడం.. ఇలాంటి వాటిని మరింత ప్రోత్సహించినట్లయింది. మంత్రి అవంతిపైనా చర్యలు తీసుకోలేదు.
మహిళాపక్షపాతి ప్రభుత్వం.. పార్టీ అని మాటల్లో చెప్పుకోవడం కాదు.. కనీసం కొంత అయినా చేతల్లో చూపాలి. మొదట అధికారం అండతో ఆడవాళ్లను చెరబట్టాలనుకున్న వారిపై ఏ స్థాయి వ్యక్తి అయినా సరే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి వారు పెరిగే వారు కాదు. కానీ తమ పార్టీ వారన్నట్లుగా ఊరుకోవడంతో.. అంతకంతకూ పెరిగిపోయారు. చివరికి అది పార్టీపై అసాంఘిక ముద్ర తెచ్చి పెట్టింది.