స్టీల్ ప్లాంట్ అమ్మకం వివరాలు బయటకు తెలిస్తే ఏమవుతుంది..? ఏమవుతుంది.. జనం తెలుసుకుంటారు. అసలేం జరిగిందో.. జరుగుతుందో తెలుస్తుంది. రెండు లక్షల కోట్ల విలువైన భూముల్ని ఎంత అప్పనంగా కట్టబెడుతున్నారో అర్థమైపోతుంది… అని చాలా మంది సమాధానం చెప్పుకుంటారు.. కానీ కేంద్రానికి మాత్రం మరో రకంగా అనిపిస్తోంది. అదేమిటంటే… దేశ భద్రత వ్యూహాత్మక, వైజ్ఞానిక, ఆర్థిక ప్రయోజనాలతో పాటు , విదేశాలతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని.. అందుకే… స్టీల్ ప్లాంట్ అమ్మకం గురించి బయటకు చెప్పలేమని అంటోంది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ.. ఆ సమాచారం చెప్పడం సాధ్యం కాదని సమాచారం ఇస్తోంది.
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దంటూ.. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాశారు. ఆ సమయంలో.. లేఖలు అందాయని..వాటిపై స్పందించాలని ప్రధాని కార్యాలయం.. సంబంధిత విభాగానికి పంపింది. ఆ ఆదేశాలపై ఏం చేశారని.. ఇనగంటి రవికుమార్ మరోసారి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుకు సమాధానం చెప్పడం సాధ్యం కాదని.. ఆన్సర్ పంపించారు. అసలు స్టీల్ ప్లాంట్ అమ్మాకనికి దేశ భద్రత వ్యూహాత్మక, వైజ్ఞానిక, ఆర్థిక ప్రయోజనాలకు.. విదేశాలతో సంబంధాలకు రిలేషన్ ఏమిటో… సామాన్యులకు అర్థం కాదు. అది తెలుసుకోవాలంటే మళ్లీ ఆర్టీఐ చట్టం ద్వారా కేంద్రాన్ని సంప్రదించాలి. అలా సంప్రదిస్తే.. మళ్లీ ఇంకో అర్థం కాని కారణం ఏదో చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.
స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది. దానికి కారణాలేమిటో తెలియదు. అప్పులనీ ఓ వైపు చెబుతూంటారు.. మరో వైపు క్యాప్టివ్ మైన్స్ ఇస్తే భారీ లాభాలు వస్తాయని మరో వైపు చెబుతూంటారు. కానీ అమ్మకాన్ని మాత్రం సీక్రెట్‌గా నిర్వహించేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ భూముల విలువతో పోలిస్తే.. ఆ ప్లాంట్‌ను వంద శాతం కొనే శక్తి సామర్థ్యాలు… ఏ సంస్థకూ లేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ కేంద్రం మాత్రం అడుగు ముందుకే వేస్తోంది.