పవన్ ది రెండు పడవల ప్రయాణం. ఆయనలో హీరో ఉన్నాడు.. రాజకీయ నాయకుడూ ఉన్నాడు. పవన్ నుంచి ఈ రెండు రకాల ప్రశ్నలకూ సమాధానాలు రాబట్టొచ్చు. బాలయ్య అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూలో కూడా అదే ఆశిస్తారు ఫ్యాన్స్. అన్ స్టాపబుల్ లో పవన్ ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. ఫిబ్రవరిలో… ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు టీజర్ వదిలారు. ఇందులో పొలిటికల్ ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరి హీరోల్నీ ”నన్ను బాలా అని పిలవండి” అని బాలయ్య అడగడం మామూలే. ఈసారి కూడా పవన్ని అలానే అడిగాడు. ”నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ.. మిమ్మల్ని మాత్రం అలా పిలవలేను” అని పవన్ నవ్వేస్తే… ”ఈ పాలిటిక్సే వద్దు” అంటూ బాలయ్య సుతిమెత్తగా కౌంటర్ వేశాడు.
ఈమధ్య నీ విమర్శల్లో వాడీ వేడీ డబుల్ ఇంపాక్ట్ లో కనిపిస్తోంది.. అని బాలయ్య అంటే.. ”చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నానండీ..” అంటూ పవన్ సరదాగా సమాధానం చెప్పడం ఆకట్టుకొంటోంది.
”చిరంజీవి గారి నుంచి నేర్చుకోవాలనుకొన్నవీ.. వద్దనుకొన్నవీ.. ఏమిటి” అని బాలయ్య అడిగినప్పుడు పవన్ ఉద్వేగభరితమైన సమాధానం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇదే సందర్బంలో వదినతో తనకున్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకొన్న విధానాన్ని ఈ టీజర్లో హైలెట్ చేశారు. అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవడంలో ఎందుకు విఫలమయ్యారన్న ప్రశ్న సంధించాడు బాలయ్య. మరి దానికి పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ బయటకు రావాలి.