ఉత్తరప్రదేశ్ .. భారతీయ జనతా పార్టీ ద్వయం.. మోడీ, షాలను కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఎస్పీ, బీఎస్పీల పొత్తు బీజేపీని వేళ్లతో సహా పెకిలించబోతోందని జరుగుతున్న ప్రచారంతో… బీజేపీ ద్వయం..తమ అసలైన మిత్రపక్షాలను వాడేసుకుంటున్నారు. వారి అసలైన మిత్రపక్షాలు దర్యాప్తు సంస్థలే. యూపీలో పొత్తు పెట్టుకున్న ఎస్పీ, బీఎస్పీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇసుక మైనింగ్ స్కామ్‌కు సంబంధించి కొద్ది రోజుల క్రితం.. అఖిలేష్ యాదవ్ అనుచరగణంపై గత వారం 14 ప్రదేశాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. ఇప్పుడు యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… ఈడీ.. అధికారులు దాడులు నిర్వహించారు.
మాయావతి యూపీ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నిర్మించిన స్మారకాలకు సంబంధించి 1,400 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. యూపీ నిర్మాణ్ నిగం మాజీ ఎండీ సీపీ సింగ్ నివాసంలో కూడా తనిఖీలు చేశారు. కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల నివాసాల నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లఖ్‌నవ్, నోయిడాలో దళిత నేతల స్మారకాలు ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇద్దరు మాజీ మంత్రులతో పాటు 197 మందిని నిందితులుగా పేర్కొంటూ యూపీ లోకాయుక్త ఎన్కే మెహ్రోత్రా ఒక నివేదిక రూపొందించారు. అయితే ఇదే కేసులో మాయావతి తప్పేమీ లేదని అఖిలేశ్ యాదవ్ అన్నారు. నిందితుల జాబితా నుంచి యూపీ ప్రభుత్వం ఆమె పేరును తొలగించింది. యూపీలో బీజేపి అధికారానికి వచ్చిన తర్వాత కేసును ఈడీకి అప్పగించారు. ఇప్పుడు కేసు విచారణ వేగవంతమైంది. ఈ దర్యాప్తులతో వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని… బీజేపీ ద్వయం భావిస్తోంది. ఇది ఎంత మేర వర్కవుట్ అవుతుందో మరి..!