ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు చాలా కాలం తర్వాత అమరావతిలో ప్రత్యక్ష పరిశీలనకు వెళతున్నారు. యూపీ ఎంపీ.. ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా తనను తాను భావించుకుంటున్న జీవీఎల్ నరిసంహారావు నేతృత్వంలో ఈ పర్యటన సాగనుంది. అసలు అమరావతి మార్పును మొదటగా బీజేపీలో పరోక్షంగా స్వాగతించింది.. ఏపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం చేస్తోందని మొదటగా ప్రకటించింది జీవీఎల్ నరసింహారావే. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ.. అదే పనిగా ప్రోత్సహించారు. నిజానికి ఆ నిర్ణయం గత ప్రభుత్వంలోనే అయిపోయిందని.. ప్రభుత్వం మారిన ప్రతీ సారి నిర్ణయాన్ని మార్చడం సరి కాదని ఆయన అప్పట్లో చెప్పి ఉంటే అసలు అమరావతి సమస్యే వచ్చేది కాదు.
కానీ జగన్ నిర్ణయాన్ని బీజేపీ ప్రోత్సాహించినట్లుగా ఆయన మాట్లాడారు. అయితే ప్రజాబిప్రాయం తెలుసు కాబట్టి పైకి మాత్రం తమ మద్దతు అమరావతికే అనిచెప్పడం ప్రారంభించారు. కానీ ఎప్పుడూ వారు రైతులకు ప్రత్యక్షంగా .. పరోక్షంగా అండగా నిలబడింది లేదు. పైగా విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు అడ్డగోలుగా అమరావతి మహిళా రైతులపై మాట్లాడారు. ఇప్పుడు అమరావతిని కదిలించే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు అమరావతిలో ఏం నిర్మాణాలు జరిగాయో పరిశీలిస్తమని బయలుదేరారు.
అమరావతి రైతులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ప్రారంభిస్తే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పోవడానికి ఉండదని.. ఆ పని చేయాలని వేడుకుంటున్నా… ఏపీ బీజేపీ నేతలు ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. కానీ రాజకీయం కోసం మాత్రం అండగా ఉన్నామని చెప్పడానికి బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడైనా అమరావతి నిర్మాణాలను చూసి చాలా కట్టాలని అనుకుంటారో ఎప్పట్లాగే గ్రాఫిక్స్ అంటారో చూడాలి.