సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ ఖాయమన్న అభిప్రాయం… అన్ని పార్టీల్లోనూ బలపడిపోవడంతో… మోదీ వ్యతిరేక పక్షాలన్నీ… తమ వ్యూహాన్ని అంతకంతకూ పదును పెట్టుకుంటున్నాయి. మోదీ మళ్లీ ప్రధాని అయితే… ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని భావిస్తున్న పార్టీలు … బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఉన్నాయి. అందుకే.. పందొమ్మిదో తేదీన.. చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత… తమ కార్యాచరణను ఖరారు చేసుకోబోతున్నాయి. ఇరవై ఒకటో తేదీన.. బీజేపీయేర పార్టీలన్నీ ఢిల్లీలో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నాయి.
బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే కూటమి అన్న ట్యాగ్ కోసం..!
మే 21న కాంగ్రెస్ సహా ఇరవై ఒక్క రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రానున్నాయి. ఇందులో యూపీఏలో భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఢిల్లీ స్థాయిలో మద్దతు పలికే పార్టీలు విడిగా పోటీ చేసినప్పటికీ.. ఆవేమీ బీజేపీకి మద్దతిచ్చే అవకాశం లేదు. అందుకే… ఎన్నికలకు సంబంధం లేకుండా.. ఆ ఇరవై ఒక్క పార్టీలు.. విడిగా.. తమ పోరాటాన్ని విభిన్న రూపాల్లో చేశాయి. ఎన్నికల సంఘం చూపుతున్న వివక్షపైన, వీవీ ప్యాట్ల లెక్కింపు అంశంపైనా…ఈ ఇరవై ఒక్కపార్టీలు పోరాడి..తామంతా ఒక్కటే అన్న భావన తీసుకొచ్చారు. ఫలితాలు రాక ముందే.. వీరంతా.. సమావేశమై.. తామంతా ఓ కూటమిగా తీర్మానం చేస్తే.. బీజేపీకి పూర్తిగా చెక్ పెట్టినట్లు అవుతుందన్న అంచనా ఉంది.
రాష్ట్రపతి ముందుగా కూటమినే ఆహ్వానించేలా ఒత్తిడి చేసేందుకు..!
మెజార్టీ ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ కూటమి లేదా..ప్రాంతీయ పార్టీల కూటమి.. మొదటగా.. రాష్ట్రపతి ఆహ్వానించకపోవచ్చనే అనుమానాలు..ప్రాంతీయ పార్టీల నేతల్లో ఉన్నాయి. దీనికి కారణం.. రాష్ట్రపతి కోవింద్ ఆ పదవి చేపట్టక ముందు వరకు బీజేపీ నాయకుడే. మోదీకి దగ్గర వ్యక్తే. అందుకే.. అతి పెద్ద పార్టీ అన్న కారణం చూపి.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీనే ఆహ్వానిస్తారన్న అనుమానం వారిలో బలపడుతోంది. అలాంటి పరిస్థితి రాకుండా…. రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చేందుకు… 21వ తేదీన పార్టీల భేటీ ఉపయోగపడుతుందన్న అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ మిత్రులపై జరుగుతున్న మైండ్‌గేమ్‌ను ఆపేందుకు..!
కౌంటింగ్ కు ముందే.. ఈ భేటీ ఏర్పాటు చేయడానికి మరో కారణం… కాంగ్రెసేతర పార్టీల మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నాలు ప్రారంభం కావడం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పర్యటనలు ప్రారంభించారు. ఆయన కేవలం.. కాంగ్రెస్ మిత్రపక్షాలు లేదా… కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటాయనుకుంటున్న పార్టీలను మాత్రమే కలిసేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో… కొత్తకూటమికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు కానీ.. అసలు లక్ష్యం మాత్రం బీజేపీయేతర మిత్రుల ఐక్యతను దెబ్బతీయడం అన్న అనుమానాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. ఆయా పార్టీల నేతలతో భేటీ కావడం వల్ల.. వారిపై.. ఇతర పార్టీల్లో అపనమ్మకం వస్తుందని.. అంతిమంగా.. అది…కూటమి నుంచి బయటకు రావడానికి కారణమవుతుందన్న వ్యూహంతో భేటీలు జరుపుతున్నారని చెబుతున్నారు. అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు.