తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితిపై, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డిపై తాను పోటీకి దిగనున్నట్లు వచ్చిన వార్తలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొట్టిపారేశారు. వాటిలో నిజం లేదని ఆమె అన్నారు.
ఉపాసనకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయానా బాబాయ్. ఆమె పిన్ని సంగీతారెడ్డి భర్త. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి అల్లుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. చేవెళ్ల నుంచి లోక్సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. పార్టీలో పొసగక బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో అతడిపై విజయం సాధించాలంటే ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని, అందుకు ఉపాసన సరైన ఛాయిస్ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక రాసుకొచ్చింది. రామ్ చరణ్, కేటీఆర్ స్నేహితులు కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే ఆ వార్తలో నిజం లేదని ఉపాసన స్పష్టం చేశారు.
“రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు అవాస్తవం. సంగీతా రెడ్డి నా బాస్. ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నా. చేవెళ్లలో చిన్నాన్నచాలా అభివృద్ధి చేస్తున్నారు” అని ఉపాసన పేర్కొన్నారు.