టాలీవుడ్లో మరో రసవత్తరమైన సంగ్రామానికి తెర లేవనుంది. ఈ సంక్రాంతిని ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అంటూ పోటీ పడిన వైనం ఇంకా అభిమానుల మనసుల్లో మెదులుతూనే ఉంది. ఈలోగా వేసవి పోరుకి సమరశంఖం వినిపించడానికి స్టార్లు తయారవుతున్నారు. సినిమాలకు సంబంధించినంత వరకూ వేసవి ఓ ముఖ్యమైన, అతి పెద్ద సీజన్. ఏప్రిల్, మే, జూన్… ఈ మూడు నెలలూ సినిమాలకు తిరుగులేని సీజన్. పరీక్షలు అవ్వగానే.. వినోదాలు పంచడానికి పెద్ద సినిమాలు, మీడియం రేంజు చిత్రాలూ బరిలో దిగిపోతాయి. ఈసారీ.. పెద్ద ఎత్తున చిత్రాలు వరుస కట్టడానికి రెడీగా ఉన్నాయి. అందులో స్టార్ల వాటానే ఎక్కువ. సో.. ఈ వేసవికి బాక్సాఫీసు దగ్గర స్టార్ వార్ జరగబోతోందన్నమాట. మరి ఈ సమరంలో పాలు పంచుకొనేది ఎవరు? విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి?
ఈ వేసవి పోరు పవన్ కల్యాణ్ కాటమరాయుడుతో మొదలు కానుంది. ఉగాది సందర్భంగా మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ తో నిరుత్సాహంలో ఉన్న పవన్ ఫ్యాన్స్.. కాటమరాయుడుతో పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళ వీరం చిత్రానికి ఇది రీమేకే అయినా… పవన్ శైలికి తగ్గట్టు దర్శకుడు డాలీ మార్పులు చేర్పులూ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ యూ ట్యూబ్‌లో దుమ్ము దులుపుతోంది. అదే ప్రభంజనం బాక్సాఫీసు దగ్గరా చూపించాలని చిత్రసీమ ఆశ పడుతోంది. వెంకటేష్ నటించిన రీమేక్ చిత్రం `గురు` కూడా ఈ వేసవి బరిలోనే నిలిచింది. నిజానికి ఈ చిత్రాన్ని జనవరిలోనే విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. వెంకీ మాత్రం వేసవిపై గురి పెట్టాడు. దాంతో సినిమా పూర్తయినా వేసవి సీజన్ కోసం చిత్రబృందం ఎదురుచూడాల్సివస్తోంది. మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా సమ్మర్ హీట్ పెంచడానికి రెడీ అవుతున్నాడు. బన్నీ కథానాయకుడిగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ మేలో విడుదల కానుంది. ఈ సినిమాని వేసవికి తీసుకురావాలని దిల్‌రాజు ముందు నుంచే స్కెచ్చులు గీశాడు. అందుకు తగ్గట్టుగానే సమ్మర్ సమరానికి తన సినిమాని వదలబోతున్నాడు.
గోపీచంద్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఆక్సిజన్, గౌతమ్ నందా ఇవి రెండూ వేసవి బరిలోనే నిలవబోతున్నాయి. ఆక్సిజన్ ఎప్పుడో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. సమ్మర్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆక్సిజన్ విడుదల కావాల్సిందే అని చిత్రబృందం కంకణం కట్టుకొందట. అందుకే.. ఈ సినిమాని ఏప్రిల్ – మేలలో విడుదల అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న గౌతమ్ నంద అంతకంటే ముందే రావొచ్చు. వరుణ్‌తేజ్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న ఫిదా కూడా మేలోనే విడుదలయ్యే ఛాన్సులున్నాయి.
ఇవన్నీ ఒకయెత్తు మహేష్‌బాబు , ప్రభాస్ చిత్రాలు మరో ఎత్తు. మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న మహేష్సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మురుగదాస్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. తాను ఏ కథ ఎంచుకొన్నా… కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడుకొన్న సామాజిక నేపథ్యంలో సాగుతుంటాయి. అవన్నీ బాక్సాఫీసు దగ్గర భారీ విజయాల్ని సాధించినవే. మరోసారి అలాంటి మ్యాజిక్కే చూస్తామని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవ్వడం ఈ సినిమాకి బోనస్‌గా మారింది. మహేష్ గత సినిమాల రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయమని చిత్రసీమ కూడా నమ్ముతోంది. ఈ వేసవికే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది.
ఇక ఈ వేసవి హీట్ బాహుబలి 2తో రెట్టింపు కానుంది. టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్… భారతీయ చలన చిత్ర పరిశ్రమ సైతం బాహుబలి 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దాదాపు రూ.500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న బాహుబలి… విడుదలయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2కి రెండు వారాల ముందు.. రెండు వారాల తరవాత సినిమాలేం విడుదలయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. బాహుబలి ఫీవర్ అలాంటిది. ఈ సమ్మర్ సమరానికి పెద్దన్నయ్య బాహుబలి 2నే అనేది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. బాహుబలి ముందు మిగిలిన సినిమాలు నిలబడతాయా? స్టార్లు కూడా కుదేలయిపోతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ వేసవికి సిసలైన సినిమా విందు అందివ్వడానికి చిత్రసీమ సిద్ధమైపోయింది. మరి ఎవరు విజేతగా నిలుస్తారన్నది ప్రేక్షకులే చెప్పాలి.