కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన సంగతి తెలిసిందే. కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ యాత్రకి రాజకీయ నాయకులూ వచ్చారు. భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్ యాత్రలో పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారనీ, చొక్కా పట్టుకుని లాగారనీ, ఎంపీ అని కనీస గౌరవం కూడా ఇవ్వలేదంటూ ఆయన ఆగ్రహించడం… అనంతరం ధర్నా… ఇవన్నీ జరిగాయి. ఇప్పుడీ వ్యవహారాన్ని లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు సంజయ్.
కరీంనగర్లో తనపై పోలీసులు దౌర్జన్యం చేశారనీ, కార్యకర్తలతో కూడా దురుసుగా ప్రవర్తించారంటూ స్పీకర్ కి సంజయ్ వివరించారు. ఆరోజు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా స్పీకర్ కి సమర్పించారు. సంజయ్ ఇచ్చిన ప్రివిలిజ్ మోషన్ పై స్పీకర్ ఓం బిర్లా వేంటనే స్పందించేశారు! వేంటనే విచారణ చేపట్టాలంటే ప్రివిలిజ్ కమిటీ ఛైర్మన్ కి ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు, విచారణ త్వరగా ముగించాలనీ, నివేదిక త్వరగా రావాలని కూడా ఆదేశించారు. తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చినట్టు సంజయ్ తెలిపారు. ఆయన అక్కడితో ఆగలేదు… జాతీయ మానవ హక్కుల కమిషన్ కి కూడా వెళ్లి, తనపై కరీంనగర్ పోలీసులు ప్లాన్ ప్రకారమే దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. అక్కడా కేసు నమోదు అయింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికీ, పోలీసులకీ వేంటనే నోటీసులు పంపింది ఎన్.హెచ్.ఆర్.సీ. ఈ కేసులో హోం శాఖ ప్రధాన కార్యదర్శి, సీఎస్, డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్లతోపాటు దాడి సమయంలో డ్యూటీలో ఉన్న కొందరు పోలీసు అధికారుల్ని ప్రతివాదులుగా పేర్కొంది!
పార్లమెంటు సభ్యుడిపై దాడి జరిగిందీ అనుకుంటే ఫిర్యాదు చేయడంలో ఎలాంటి తప్పూలేదు! అయితే, ఎంపీ సంజయ్ తనపై జరిగిందంటున్న దాడిపై ఫిర్యాదుతోపాటు… దానికి నేపథ్యమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి, నెలరోజులుగా వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా కేంద్రానికి చెప్పానని చెబితే బాగుండేది! దాడి ఘటనను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడం సరైందే. దాంతోపాటు కార్మికుల సమస్యల్ని కూడా ఇదిగో ఈ కేంద్రమంత్రికి చెప్పాననో, ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితిని ఫలానా జాతీయ నేతలకు వివరించాననో… దాన్లో భాగంగా తనపై దాడి ఘటనను కూడా నివేదించాననో ఆయన చెప్తే బాగుండేది! ఆర్టీసీ కార్మికుల పట్ల రాజకీయ ఉద్దేశాలతోపాటు, మానవీయ కోణం కూడా మాకు ఉందని చెప్పుకునే అవకాశం ఉండేది కదా!