జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఢిల్లీలోని ప్రజా ప్రభుత్వ అధికారాల్ని తగ్గించే ఆర్డినెన్స్ తేవడం, పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించాలనుకోవడం, బీజేపీని ఓడించడం కోసం విపక్ష నేతల సమావేశాలు.. ఇలాంటి వాటితో ఢిల్లీ రాజకీయాలు జోరు మీద ఉన్నాయి. అయితే దేశ్ కీ నేత కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు.
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు కూడా ప్రకటించలేదు. గత మూడు, నాలుగు రోజులుగా చాలా అంశాలపై బీజేపీపై పోరాడుతున్న నేతలంతా ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం నోరు తెరవడం లేదు. చివరికి ఆప్తమిత్రుడు కేజ్రీవాల్‌కు సమస్య వచ్చినా మద్దతుగా ఒక్క ప్రకటన చేయలేదు.
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వివిధ పార్టీలు సంఘిభావం తెలిపాయి. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను గుంజుకుంటూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై పోరును జాతి పోరాటంగా చెబుతున్న అరవింద్ కేజ్రీవాల్ అందర్నీ కలిసి రావాలని కోరుతున్నారు. మమతా బెనర్జీ కేజ్రీవాల్ ను కలిసి మరీ సంఘిభావం తెలిపారు. అయితే ఆప్తమిత్రుడైన కేసీఆర్ మాత్రం కనీసం కేజ్రీవాల్‌కు సంఘిభావం చెప్పలేదు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఒక్క ప్రకటనా చేయలేదు.
మే 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వాధినేత.. శాసనసభకు అధిపతి కాదని.. మోడీ పార్లమెంటును ఎందుకు ప్రారంభించాలని అన్ని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. మరో 2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్నారు. ఆయన కేసీఆర్ ను కలుస్తానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ కలవలేదు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి ఆహ్వానం రాలేదో వెళ్లలేదో తెలియదు.
కేసీఆర్ ప్రతీ సారి వ్యూహాత్మక మౌనం పేరుతో కొన్నాళ్లు స్పందించరు. తర్వాత ప్రకటనలు చేస్తారు. మరి మళ్లీ ఎప్పుడు ప్రకటనలు చేస్తారో ?. చివరికి కేసీఆర్ ప్రతినిధిగా కవిత కూడా స్పందించకపోవడంతో.. తెర వెనుక ఏదో జరుగుతోందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.