ఉపేంద్ర అంటే ఇప్పటి జనరేషన్ కి ఒక మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నో, లేక కన్నడనాట కూడా పాలిటిక్స్ లో వస్తున్న సినీ నటుడిగానో మాత్రమే తెలుసు కానీ ఒకప్పుడు ఈయన సంచలన దర్శకుడు. కన్నడ సినిమాకి మొదటి సారి పది కోట్ల రెవెన్యూ చూపించిన A అనే సినిమా ఆయన తీసిందే. ఆయన తీసిన A లాంటి కన్నడ సినిమాలు తెలుగు లో డబ్ అయి 100 రోజులు ఆడాయి. ఆయన సినిమాలే కాదు ఆయన టైటిల్స్ కూడా అంతే సంచలనం.
మొదటి సినిమా ఒక మామూలు కామెడీ సినిమా తీసాడు (తర్లే నన్ మగా ) . హిట్టే కానీ ఆయనకంటూ ప్రత్యేక ముద్ర రాలేదు. ఇక ఆ తర్వాత “ష్” అనే సినిమా తో సూపర్ హిట్ కొట్టాడు. ఒకే అక్షరం తొ టైటిల్ పెట్టడం, విచిత్రమైన టైటిల్స్ పెట్టడం అనే ట్రెండ్ మొదలెట్టాడు. ష్, ఓం, A, 卐 (స్వస్తిక్ సింబల్ ఇది – ఒక సినిమా కి ఇదే టైటిల్ గా పెట్టాడు), ఇలా ఉండేవి ఆయన టైటిల్స్. ప్రతి సినిమా సంచలనమే. ఉపేంద్ర ఈ ట్రెండ్ స్టార్ట్ చేసాకే, తెలుగు లో జెడి చక్రవర్తి పేరులేని సినిమా (టైటిలే లేకుండా సినిమా విడుదలైంది) తీసాడు. ఇంకొక సినిమా కి ఒక అక్షరం, పదం కాకుండా, “గ్రాఫిక్ ఇమేజ్” ని టైటిల్ గా పెట్టాడు. మనం ఏదైనా చాలా బాగుంది అని చెప్పడానికి బొటనవేలునీ, చూపుడు వేలునీ సర్కిల్ లా కలుపుతూ “సూపర్” అని ఎలా సూచిస్తామో, ఆ ఇమేజ్ ని టైటిల్ గా పెట్టాడు. బహుశా భారతదేశం లో అలాంటి టైటిల్ పెట్టడం ఇదే ప్రధమం. దీన్ని ఎలా పలకాలో తెలీక జనాలు, ఎలా వ్రాయాలో తెలీక జర్నలిస్టులు “సూపర్” అనే మాటని ప్రచారం లోకి తెచ్చారు. కానీ పోస్టర్ మీద ఎక్కడా సూపర్ అన్న పదం ఉండదు. కేవలం ఆ ఇమేజ్ మాత్రమే ఉంటుంది. మరొక సినిమా కి ఉపేంద్ర అని తన పేరునే టైటిల్ గా పెట్టాడు. ఒక దర్శకుడు తన సినిమాకి తనపేరే పెట్టడం కూడా బహుశా భారతదేశం లో ఇదే ప్రధమం. అయితే ఈ టైటిల్ విషయం లో ఉపేంద్ర అప్పట్లో ఇచ్చిన వివరణ మరింత విచిత్రంగా ఉండేది. ఈ సినిమా లొ హీరో తనే. హీరోయిన్ లు ప్రేమ, దామిని, రవీనా టాండన్. ఈ టైటిల్లోనే హీరో హీరోయిన్ల అందరి పేర్లు ఉన్నాయనీ, ఉపేంద్ర లో ఉ అంటే ఉపేంద్ర, పే అంటే ప్రేమ, ద అంటే దామిని, ర అంటే రవీనా – ఇదీ ఆ వివరణ.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఆయన తన ఆత్మకథ వ్రాస్తున్నాడిపుడు. ఇటీవలే కర్ణాటక ప్రఙ్ఞావంత జనతా పక్ష అనే రాజకీయ పార్టీ పెట్టిన ఆయన తన ఆత్మ కథ టైటిల్ లోనూ తన ప్రత్యేకత నిరూపించుకున్నారు . ఇంతకీ ఆయన ఆత్మకథ పేరు ఏంటంటే – “దీన్ని చదవకండి (ఇదన్న ఒడ్బేడి)”. అప్పట్లో ఆయన టైటిల్స్ తో పాటూ సినిమాలు కూడా సంచలనమే. మరి ఇప్పుడు ఈ ఆత్మకథ టైటిల్ సంచలనమే, మరి పుస్తకం విడుదలయ్యాక ఎన్ని సంచలనాలుంటాయో వేచి చూడాలి.