హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ జంట నగరాల్లో హాట్ ప్రాపర్టీల్లో ఒ!కటిగా మారింది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రోస్టేషన్ ఇరువైపులా సుమారు 430కి పైగా ఎకరాల్లో మూసీ వెంబడి హెచ్ఎండీఏ ఈ భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో అత్యంత విశాలమైన 150, 120, 80, 60 ఫీట్ల వెడల్పుతో కూడిన రోడ్లను, మూసీ వెంబడి తీరం ప్రాంతంలో 3 కి.మీ పొడవైన పార్కును నిర్మించారు. వేలంలో మంచి ధరకు హెచ్ఎండీఏ అమ్మింది.
నివాసాలకు అత్యంత అనువుగా ఉండడంతో పెద్ద ఎత్తున వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంతో పాటు అపార్టుమెంట్లు, భారీ బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణం అవుతున్నాయి. కొన్ని పూర్తవుతున్నాయి. రవాణా సౌకర్యం కూడా సమస్య లేదు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని రోడ్ల మీదుగా ఉప్పల్ బస్టాండు తర్వాత ఉన్న ఏసియన్ మల్టీప్లెక్స్ కలిసే రోడ్డుతో లింకురోడ్డును ఏర్పాటు చేశారు. పీర్జాదిగూడ కమాన్ రోడ్డును కలిపేలా కొత్తగా 100 అడుగుల విస్తీర్ణంలో లింకు రోడ్డును నిర్మిస్తున్నారు. నాగోల్ నుంచి విజయవాడ హైవే ఉన్న పెద్ద అంబర్‌పేట, అదేవిధంగా తారామతిపేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును కలిసేలా ఒక రేడియల్ రోడ్డును నిర్మించారు. అదే తరహాలో నాగోల్-ఉప్పల్ మధ్య మూసీ వెంబడి మరో రేడియల్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఉప్పల్ భగాయత్‌కు మరింత డిమాండ్ పెరగనుంది.
హెచ్ఎండీఏలో వేలంలో కొనుగోలు చేసిన వారు ఇళ్లు, అపార్టుమెంట్లు నిర్మించి అమ్ముతున్నారు. మెరుగైన ప్రాంతం కావడంతో.. పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది. నివాసానికి మంచి ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఉప్పల్ భగాయత్‌లో విశాలమైన రోడ్లు ఇతర సౌకర్యాలు ఉండటంతో భవిష్యత్‌లో మంచి ధర వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.