మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి ఉండటంతో ఈ మ్యాచ్ ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ ఆరింట్లో గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లక్నో కూడా 12 పాయింట్లతో ఉండగా నెట్ రన్ రేట్ కారణంగా వెనకబడింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి పైస్థానానికి ఎగబకాలని లక్నో పట్టుదలతో కనిపిస్తోంది. ఉప్పల్ మ్యాచ్ లో ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.ఈ మ్యాచ్ లో ఓడితే మాత్రం ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తుంది.
హైదరాబాద్ లో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో నేటి మ్యాచ్ పై అనుమానాలు నెలకొన్నాయి.ఆకాశం మేఘావృత్తమై కనిపిస్తుండటంతో ఈ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కల్గిస్తాడా..? అని క్రికెట్ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షంతో మ్యాచ్ ఆగిపోతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు.
నేడు తెలంగాణలో వర్షం కురిసే ఛాన్స్ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రమంతటా పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం లేదు.