మరో మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ తెరపైకి వస్తున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సుకుమార్ కథలన్నీ సున్నితంగా, ఇంటిలిజెంట్‌గా ఉంటాయి. కానీ శిష్యుడు మాత్రం పూర్తిగా ‘రా’ టైపు కథని తయారు చేసుకున్నాడట. క్లైమాక్స్‌లో అయితే.. తెలుగు సినిమా పరిమితుల్ని, పరిధుల్నీ దాటుకుని వెళ్లి మరింత రాగా తీశాడని తెలుస్తోంది. క్లైమాక్స్ విన్నాక.. సుకుమారే షాకైపోయాడంటే… అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు. ఇది ఓ మత్యకారుడి ప్రేమకథ. రాజు – పేద టైపు కథలాంటిదే అని తెలుస్తోంది. ప్రేమ సన్నివేశాలు సరికొత్తగా ఉండబోతున్నాయని, క్లైమాక్స్‌లో అయితే.. ఓ షాక్ తగలక తప్పదని తెలుస్తోంది. ఓ రకంగా ఇది యాంటీ క్లైమాక్స్. ఏ సినిమాకైనా క్లైమాక్సే కీలకం. అక్కడే ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారా, లేదా అన్నది తెలిసిపోతుంది. కాకపోతే యాంటీ క్లైమాక్స్‌లు తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా పడవు. మరి ఉప్పెన విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. ఇదో యదార్థ సంఘటన అట. దర్శకుడు బుచ్చిబాబు ఇలాంటి మత్యకారుల నేపథ్యం నుంచి వచ్చినవాడే. తన ఊర్లో జరిగిన ఓ సంఘటననే కథగా రాసుకున్నాడట. మరి… దాన్ని తెరపైకి ఎలా తీసుకొస్తాడో చూడాలి.