కొన్ని సినిమాలు మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేస్తాయి. విడుదలకు ముందు పాటలతో అంచనాలు పెంచుకుంటాయి. ఆలాంటి సినిమాల్లో ఉప్పెన కూడా వుంది. ‘నీకళ్ళు నీలి సముద్రం’ పాట ఉప్పెన పై అంచనాలు పెంచింది. యువతని విపరీతంగా ఆకట్టుకున్న పాటగా నిలిచింది. ఇప్పుడీ సినిమా నుండి మరో పాట వదిలారు. ”జలజల జలపాతం” అనే పల్లవితో సాగిన ఈ పాట వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్ ని గుర్తుకు తెచ్చింది.
దేవిశ్రీ ప్రసాద్ మామూలు మేలోడీలు ఇవ్వలేదు. కానీ మారుతున్న ట్రెండ్ పట్టుకొనే ప్రయత్నంలో దేవి మెలోడీ లైన్ తప్పినట్లు అనిపించింది కొన్నాళ్ళుగా. అయితే ఉప్పెనలో మంచి మెలోడి చేసే అవకాశం వచ్చింది. జస్ ప్రీత్ జాస్, శ్రేయా గోషాల్ పాడించిన ఈ పాట చెవులకు ఇంపుగా వుంది. శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఉప్పెన ట్రైలర్ లో సముద్రంలో ఓ రాత్రిని చాలా కీలకంగా చూపించారు. ఆ రాత్రిలో ప్రేమ జంట మధ్య వచ్చే పాటిదని సాహిత్యం వింటే అర్ధమౌతుంది. అయితే ఇంత మంచి మెలోడిలో మేల్ వాయిస్ జస్ ప్రీత్ కాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్ గా వుండే వాయిస్ తో పాడించుంటే బావుండేది. శ్రేయా వెర్షన్ మాత్రం అదిరిపోయింది. టోటల్ గా ఈ పాటతో దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన వింటేజ్ టచ్ ని గుర్తు చేశారు.