ఓ పాటకు ఒకడ్రెండు వెర్షన్లు రాయించుకోవడం ఇది వరకు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్దరు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయడం జరిగేది. అయితే.. ఇప్పుడు ఎవరికీ అంత టైమ్ లేదు. ఒకర్ని నమ్ముకోవడం, వాళ్లకు ఆ పాట అప్పజెప్పడం, వాళ్లతోనే రెండు మూడు వెర్షన్లు రాయించుకోవడం ఇదే తీరు.
కానీ `ఉప్పెన` విషయంలో మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. వైష్ణవ్ తేజ్ హీరో. ఇప్పటికి రెండు పాటలు విడుదలయ్యాయి. `నీ కన్ను నీలి సముద్రం` పాటైతే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రెండో పాట `థగ్ థగ్..` కూడా ఓకే అనిపించుకుంది. దాంతో ఈ ఆల్బమ్ పై అంచనాలు పెరిగిపోయాయి. అందుకే దేవి ఇచ్చిన ఓ మంచి ట్యూన్‌ని ఏకంగా నలుగురు గీత రచయితలకు ఇచ్చాడట దర్శకుడు. చంద్రబోస్, రామజోగయ్య, శ్రీమణి, బాలాజీ..లతో ఈ పాట రాయించుకున్నార్ట. వాళ్లలో రామజోగయ్య పాట అద్భుతంగా కుదిరిందని టాక్. దాన్ని సుకుమార్ ఓకే చేసి, దేవికి పంపితే.. `నాకు ఈ పాట వద్దు…` అని దేవి తిరస్కరించాడని తెలుస్తోంది. ఈ పాట విషయంలో దేవి – సుక్కు తర్జన భర్జనలు పడ్డార్ట. సుకుమార్ రామజోగయ్య వైపు ఉంటే.. దేవి మాత్రం `మరొకరితో మరో వెర్షన్ రాయించండి` అని చెప్పాడని టాక్. రామజోగయ్య రాసిన పాట నిజంగానే దేవికి నచ్చలేదా? లేదంటే రామజోగయ్య ఇచ్చిన పాట తీసుకోవడం దేవికి ఇష్టం లేదా? అనేది సుకుమార్ తేల్చుకోలేకపోయాడని, అందుకే.. `ఈ పాట విషయంలో ఎలాంటి నిర్ణయమైనా నువ్వే తీసుకో..` అని బాధ్యత అంతా బుచ్చిబాబుకే అప్పగించేసినట్టు టాక్. నలుగురితో పాట రాయించినా, ఎవరి పాట ఓకే చేశారో, ఆయా గీత రచయితలకే చెప్పలేదని, ఆ పాట బయటకు వచ్చేంత వరకూ.. ఎవరి పాట ఉంటుందో చెప్పడం కష్టమని టాక్. త్వరలోనే ఈ పాట బయటకు రాబోతోంది. మరి ఎవరి వెర్షన్ ఉంటుందో? ఎవరి మాట నెగ్గించుకున్నారో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాలి.