వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమా… `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడు. ఈ సినిమాపై అంచనాలున్నాయి. పాటలు అదరగొట్టేశాయి. టీజర్ ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
లైలా మజ్ను, దేవదాస్ పార్వతి లా ఓ మాదిరిగా ప్రేమించాలని.. అనుకునే ఓ కుర్రాడికి బస్సులో అపరంజి బొమ్మలాంటి అమ్మాయి కనిపిస్తుంది. అప్పటి నుంచీ వాళ్ల మధ్య బంధం చిగురిస్తుంది.
అయితే.. అన్ని ప్రేమకథల్లా… ఇక్కడా ఓ అడ్డంకి ఉంది. పరువు – ప్రతిష్ట అని పాకులాడే రాయుడు. మరి రాయుడ్ని ఎదిరించిన ఈ ప్రేమికులు.. తమ ప్రేమని ఎలా సఫలీకృతం చేసుకున్నారు..? అన్నదే ఈ ఉప్పెన.
వైష్ణవ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. తన డైలాగులు వింటుంటే సాయిధరమ్ తేజ్ గొంతే గుర్తొస్తోంది. కృతి శెట్టి.. ఇప్పటికే చాలా ఫేమస్ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య.. కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక రాయుడుగా… విజయ్‌సేతుపతి నటించాడు. ట్రైలర్లో రాయుడిదే డామినేషన్. మరి తెరపై ఎలా ఉంటుందో?
అబద్ధాలాడితేనే ఆడపిల్లలు పుడతారంటే, మరీ ఇంత అందంగా పుట్టేసిందంటే.. ఈళ్ల బాబు మినిమం మర్డర్ గానీ చేసుంటాడా?
ప్రేమంటే పట్టుకోవడం నాన్నా – వదిలేయడం కాదు
రాయుడికి పరువు వేరు ప్రాణం వేరు కాదురా.. రెండూ ఒక్కటే
నువ్వంటే నాకు అదో మాదిరిష్టం బేబమ్మా
ప్రేమ గొప్పదైతే చరిత్రల్లోనూ, సమాధుల్లోనూ కనపడాలి గానీ, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనీ, ఇళ్లల్లో కనపడితే దాని విలువ తగ్గిపోదూ… అందుకే ప్రేమెప్పుడూ చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు… ఇలాంటి డైలాగులు టీజర్లో వినిపించాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. మొత్తానికి ఈ ట్రైలర్ ఓ చిరుగాలిగా మొదలై… మెల్లమెల్లగా సునామీలా.. మారిపోయింది. ఎమోషన్స్ తో పాటు డార్క్ నెస్‌కి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. చాలా రోజుల తరవాత వస్తున్న పూర్తి స్థాయి ప్రేమకథ కాబట్టి… యావరేజ్ టాక్ వచ్చినా, వసూళ్లు కుమ్ముకోవడం ఖాయం.