హైదరాబాద్: కేరళలో బార్ల వ్యాపారాన్ని మూసేయాలని, కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌లోనే బార్లను నడపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీమ్ కోర్ట్ సమర్థించింది. ఈ నిర్ణయంపై కేరళకు చెందిన బార్ హోటల్స్ అసోసియేషన్ మొదట ఆ రాష్ట్ర హైకోర్ట్‌లో అప్పీల్ చేయగా, ఈ ఏడాది మార్చ్ 31న హైకోర్ట్ రాష్ట్రప్రభుత్వాన్నే సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. దీనితో అసోసియేషన్‌వారు సుప్రీమ్ కోర్టులో అప్పీల్ చేశారు. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్ట్ నిర్ణయాన్నే సమర్థించింది.
జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఈ తీర్పు ఇస్తూ, మద్యాన్ని అమ్మటం, బార్లలో విక్రయించటం ప్రాథమిక హక్కేమీ కాదని గుర్తు చేసింది. కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త మద్యం విధానాన్ని 2014 ఆగస్ట్ నుంచి అమలులోకి తీసుకొచ్చింది. దీనితో రాష్ట్రంలో ఉన్న దాదాపు 300 బార్లు వైన్ షాపులుగా మారిపోయాయి. మందుబాబులు బార్‌కు వెళ్ళి మందు తాగాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న 24 ఫైవ్ స్టార్ హోటల్సే శరణ్యమయ్యాయి. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఆ నాడు కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెడుతూ, మద్యం వినియోగం రాష్ట్రంలో యువతను తీవ్రంగా చెడగొడుతోందని, పదేళ్ళలో సంపూర్ణ మద్యనిషేధాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.