పూజా ఖేద్కర్ ను యూపీఎస్సీ రీకాల్ చేసింది. మళ్లీ ట్రైనింగ్ ఇచ్చి జనంలోకి వదులుతారా లేకపోతే కేసులు పెట్టి ఆమె ర్యాంక్ ను రద్దు చేస్తారా అన్నది తర్వాత విషయం . కానీ తన అతి ప్రవర్తనతో పూజా ఖేద్కర్ ప్రచారంలోకి వచ్చింది. ఆమె ప్రతీ విషయంలోనూ యూపీఎస్సీని మోసం చేశారని తేలింది. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టారని అంటున్నారు. ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి పూజాఖేద్కర్ ను అంటున్నారు కానీ… ఇంకా చాలా మంది అలాంటి వాళ్లే ఉన్నారని సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పెడుతున్నారు.
యువత లక్ష్యం యూపీఎస్సీ
యూనియర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే..యువత స్వప్నం. ర్యాంక్ కొట్టి కలెక్టర్ అయిపోవాలని ఆశపడని యువకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. స్కూల్ దశ నుంచే అదే టార్గెట్ గా చదివేవారు ఉంటారు. వారి లక్ష్యానికి… తగ్గట్లుగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి అత్యుత్తమ టాలెంట్ ను దేశానికి అందించాల్సిన బాధ్యత యూపీఎస్సీకి ఉంది. కానీ జరుగుతున్న పరిణామాలు.. బయటపడుతున్న వ్యవహారాలు చూస్తే… అనుకున్నంత గొప్పగా వ్యవస్థ లేదని ఎవరికైనా అర్థమవుతుంది. ఇది యువతలో ఖచ్చితంగా నిరుత్సాహం నింపేదే.
తప్పుడు సర్టిఫికెట్లు కనిపెట్టలేకపోవడం సిగ్గు చేటు కాదా ?
తాము వికలాంగులమంటూ సర్టిఫికెట్లు తెస్తున్న వారిని యూపీఎస్సీ నిజాలేంటో కనిపెట్టలేకపోతోంది. ఆ సర్టిఫికెట్లు తప్పుడు వని నిర్ధారణ కూడా చేసుకోలేకపోతోంది. పూజా ఖేద్కర్ ఆరు సార్లు టెస్టులను తప్పించుకున్నారు.. చివరికి ఆమె ఇచ్చిన అనుమానాస్పద సర్టిఫికెట్లనే ఆమోదించి ఐఏఎస్ ర్యాంక్ ఇచ్చారు. ఆమె ప్రవర్తన అత్యంత ఘోరంగా ఉంది. మాములుగా చిన్న చిన్న ఉద్యోగాల్లోనే సైకోమెట్రిక్ టెస్టులు చేస్తున్నారు. మరి దేశానికి సేవ చేయాల్సిన సివిల్ సర్వీస్ అధికారుల విషయంలో ఇలాంటి విపరీత ప్రవర్తన ఉన్న వారిని ఎలా ఎంపి చేస్తున్నారు.
పడిపోతున్న ప్రమాణాలు – ఇవే డేంజర్ బెల్స్
సివిల్ సర్వీస్ అధికారుల ఉద్యోగ నిర్వహణా స్థాయి ప్రమాణాలు పడిపోతున్నాయి. దానికి దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలే సాక్యం. చట్టం, రాజ్యాంగాలను పాటించేవారు కరువవుతున్నారు. రాజకీయ బాసుల కాళ్ల దగ్గర కూర్చునేవారు ఎక్కువ అయిపోతున్నారు. అభివృద్ధి కోసం.. ప్రజల కోసం ప్రభుత్వంతో పని చేయడం కాకుండా రాజకీయం కోసం పని చేస్తున్నారు. వివాదాస్పదమవుతున్నారు. ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమే. ఖచ్చితంగా యూపీఎస్సీని సంస్కరించాల్సిందే. లేకపోతే అత్యున్నత అధికార వ్యవస్థ… నవ్వుల పాలవుతుంది.