ప్రజల్లో బలమైన ముద్రపడాలంటే.. వారి కోసం.. నిజాయితీగా చేసే పోరాటం… ఒకటి ఉండాలి. అది ప్రజల్ని కదిలించాలి. అలాంటి అవకాశం రాజకీయ పార్టీలకు చాలా అరుదుగా వస్తుంది. ఇప్పుడు..జనసేన పార్టీకి.. యూరేనియం తవ్వకాల విషయంలో అది వచ్చింది. గనుల తవ్వకాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఓ పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి అనేక విప్లవాలు.. పోరాటాలు పుట్టుకొచ్చాయి. చరిత్రలో నిలిచిపోయిన వారుకూడా.. ఈ తరహా పోరాటాల నుంచే వచ్చారు. ఇప్పుడు.. నల్లమలలో యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చి.. కేంద్రం జనసేనకు ఓ అవకాశం కల్పించింది.
గిరి పుత్రుల కోసం పోరాడే అవకాశం ..!
పవన్ కల్యాణ్ ఆలోచనలు.. అబిరుచుల ప్రకారం..పర్యావరణానికి హాని చేస్తే క్షమించలేరు. ఈ కోణంలో చూస్తే.. ఆయన యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడే అవకాశం ఉంది. ఇది తెలంగాణకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ప్రస్తుతం నల్లమలలో యురేనియం తవ్వకాలపై తెలుగు రాష్ట్రాల్లో పోరు ఉధృతమైంది. స్థానికుల పోరాటానికి తోడు.. రాజకీయ పార్టీలు సైతం ఆందోళనకు సిద్ధం కావడంతో ప్రశాంతమైన అరణ్యంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల్లోని గిరిజనులు ఇప్పటికే పోరుబాట పట్టారు. యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని కేంద్ర వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తరచూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
విపక్ష పార్టీలు, సంఘాలన్నింటినీ కలుపుకోవచ్చు..!
యురేనియం తవ్వకాల అంశాన్ని బీజేపీ, టీఆర్ఎస్ మినహా విపక్ష పార్టీలన్నీ సీరియస్గా తీసుకున్నాయి. రేవంత్రెడ్డి రెండు సార్లు నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ ప్రాంతంలో పర్యటించి ఆదివాసీలకు మద్దతు తెలిపి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలు చేయ్యనిచ్చేది లేదని.. ఆందోళనకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీజేఎస్అధ్యక్షుడు కోదండరాం కూడా అమ్రాబాద్ ప్రాంతంలో పర్యటించి వచ్చారు. అటు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో ఉద్యమం మొదలుపెట్టాయి. ఇక ఆదివాసీ, గిరిజన సంఘాలు మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యక్షంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. వీరందరూ పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉండొచ్చు. లేదా బహునాయకత్వంలో పవన్ ఒకరిగా ఉన్నా.. ఫోకస్ ఆయనపైనే ఉంటుంది.
ఇంతకు మించిన గొప్ప అవకాశం మళ్లీ రాదు..!
నల్లమల ప్రాంత ప్రజల పోరాటానికి అన్ని వర్గాలు మద్దతు తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పోరటానికి జనాకర్షణ ఉన్న నేత కావాలి. ఆ నేత పవన్ కల్యాణే అయితే.. జనసేన పార్టీకి పునాదులు గట్టిగా పడినట్లే. కేంద్రంతో సన్నిహిత సంబంధాలున్నాయని.. టీఆర్ఎస్తో… కలుపుగోలుగా ఉన్నామని.. యూరేనియం తవ్వకాలపై.. తూతూ మంత్రం పోరాటం చేస్తే.. జనసేనకు గొప్ప అవకాశం మిస్సయినట్లే. మరి పవన్ దూకుడుగా వెళ్తారో.. లేదో చూడాలి..!