ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా పయ్యావుల 1999, 2014లో ఓడిపోయారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. మధ్యలో 2004., 2009, 2019ల్లో గెలిచారు. అప్పుడు టీడీపీ ఓడిపోయింది. అందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈ సారి సెంటిమెంట్ తప్పడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన వివాదంతో.. పయ్యావుల పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.
ఉరవకొండలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఫలితం రెండు వేల ఓట్లకు అటూ ఇటూగానే ఉంటుంది. పయ్యావులకు ప్రత్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డే ఉంటున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి సిపిఐ ఎంఎల్ పార్టీలో ఉన్న సమయంలో కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా సీటు దక్కించుకొని 2004 ఎన్నికల్లో అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి పై పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా రెండవసారి పయ్యావుల కేశవతో పోటీపడి మరోసారి ఓటమి చవిచూశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం మారిన పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉరవకొండ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పట్టు వదలకుండా మూడవసారి 2014 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ పై పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి పయ్యావుల కేశవ్ చేతిలో 2,232 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
ఉరవకొండ నియోజకవర్గం లో పయ్యావుల కేశవ్ కుటుంబానికి పట్టు ఉంది. భూస్వామ్య కుటుంబం కలసి వచ్చే సామాజికవర్గాలు ఉన్నాయి. ఐదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డికి ఇంటి పోరు సమస్యగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తమ్ముడు వై మధుసూదన్ రెడ్డి తన అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరీక్షించుకునేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కొంత కాలం నుంచి సోదరులిద్దరి మధ్య రాజకీయ పోరాటం జరుగుతోంది. మధుసూదన్ రెడ్డి పయ్యావుల దగ్గర డబ్బులు తీసుకుని ప్రతీ సారి ఓడిస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపిస్తూ ఉంటాడు. దీంతో సోదరుడ్ని మరోసారి ఓడిస్తానని మధుసూదన్ రెడ్డి పంతం పెట్టి రంగంలోకి దిగారు. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ లో ఉన్న మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండడంతో ఓట్లను చీల్చుతారని తేలిపోయింది.
నియోజకవర్గంలో ప్రధానంగా హంద్రీనీవా, తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే నీటి మీద ఆధారపడి రైతులు ఎక్కువగా జీవనం కొనసాగిస్తుంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రధానంగా నేతలు సకాలంలో తాగునీటిని తాగు నీటిని అందిస్తామంటూ హామీలు గుప్పిస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా ఇదే హామీలు ఇస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో విద్యావంతులు కూడా ఎక్కువ గా ఉంటారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఉరవకొండలో ఈ సారి కూడా పయ్యావులకే సానుకూల పవనాలు వీస్తున్నాయి. 1994లోలా టీడీపీ గెలుస్తుంది.. తానూ గెలుస్తానని పయ్యావుల ధీమాగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి చివరి ప్రయత్నంలో భాగంగా ఎలక్షనీరింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టారు.